Telangana: మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్.. దరఖాస్తు ఫీజు వివరాలు!

Telangana: తెలంగాణ రాష్ట్రంలో వైన్స్ షాపుల లైసెన్సుల కేటాయింపుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గానూ లైసెన్సుదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న లైసెన్సుల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనుండగా, డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్సులు అమల్లోకి రానున్నాయి.

Telangana: ఈసారి లైసెన్స్ దరఖాస్తు ఫీజును భారీగా పెంచింది ప్రభుత్వం. గతంలో రూ. 2 లక్షలుగా ఉన్న అప్లికేషన్ రుసుము, ఇప్పుడు రూ. 3 లక్షలుగా (నాన్ రిఫండబుల్) నిర్ణయించారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా సమర్పించుకోవచ్చని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. అయితే లైసెన్స్ కాల పరిమితి మాత్రం డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు రెండు సంవత్సరాలపాటు మాత్రమే ఉంటుంది.

అలాగే, లైసెన్సుల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. గౌడ్స్ సామాజిక వర్గానికి 15 శాతం, షెడ్యూల్ కులాలకు 10 శాతం, షెడ్యూల్ తెగలకు 5 శాతం కేటాయింపు ఉంటుంది. లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయించబడతాయి. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు కూడా ఈ టెండర్లలో పాల్గొనే వీలుంది.

లైసెన్స్ ఫీజులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎంపికైన లైసెన్సుదారులు 6 స్లాబుల విధానంలో లైసెన్స్ ఫీజులు చెల్లించవచ్చు. 2011 జనాభా లెక్కల ఆధారంగా మద్యం షాపుల సంఖ్య నిర్ణయించబడింది.

తెలంగాణలో మద్యం వ్యాపారాన్ని లాభాల పంటగా భావిస్తుంటారు. అందువల్లే ప్రతి టెండర్ సమయంలో వేలాది మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈసారి ఫీజు పెరగడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. కాగా, దరఖాస్తుల తుది తేదీలను త్వరలో ప్రకటించనుంది ఎక్సైజ్ శాఖ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *