Medaram Jathara: తెలంగాణలో జరిగే అతి పెద్ద గిరిజన పండగ సమ్మక్క-సారలమ్మ జాతర వచ్చే సంవత్సరం 2026 జనవరిలో జరగనుంది. ఈ మహా జాతర కోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. ‘తెలంగాణ కుంభమేళా’గా పేరొందిన ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Medaram Jathara: ఆసియాలో అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతర ప్రతి రెండేళ్లకోసారి ఘనంగా జరుగుతుంది. సమ్మక్క-సారలమ్మ దేవతల పూజారుల సంఘం ఇప్పటికే తేదీలను ప్రకటించింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. ఈ నిధులను మేడారం ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య పనులు, జాతర నిర్వహణ కోసం వినియోగించనున్నారు.
గిరిజన సంక్షేమ శాఖ మంజూరు చేసిన ఈ నిధుల ద్వారా మేడారం జాతరను గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం అడ్లూరు లక్ష్మణ్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు.
మేడారం జాతర తేదీలు (2026):
- జనవరి 28 (బుధవారం): సారలమ్మ గద్దె చేరిక
- జనవరి 29 (గురువారం): సమ్మక్క గద్దె చేరిక
- జనవరి 30 (శుక్రవారం): భక్తులు అమ్మవార్లను దర్శించి మొక్కులు చెల్లించుకోవడం
- జనవరి 31 (శనివారం): సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం
ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ గిరిజన జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈసారి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
