Viral News: ఇటీవల భార్యల చేతిలో భర్తలు హత్యకు గురైన ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈసారి ఒక ప్రియురాలు తన ప్రియుడినే డబ్బుకోసం సైబర్ ముఠాకు అమ్మేసిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
Viral News: చైనాకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి, తన 19 ఏళ్ల ప్రియుడిని మయన్మార్‌లోని సైబర్ క్రైమ్ గ్యాంగ్‌కు 10 వేల పౌండ్లకు (సుమారు 11 లక్షల రూపాయలు) అమ్మేసింది. దీంతో ఆ యువకుడు తీవ్రమైన చిత్రహింసలకు గురయ్యాడు. అతని బరువు వేగంగా తగ్గిపోగా, వినికిడి శక్తి కూడా దెబ్బతింది. చివరికి అతన్ని తిరిగి రప్పించడానికి కుటుంబం పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వచ్చింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆ గ్యాంగ్ అతనిని రోజుకు 20 గంటలు బలవంతంగా పని చేయించేది. ఆన్లైన్లో ప్రజలను మోసం చేయమని ఒత్తిడి తెచ్చేది. తిరస్కరిస్తే దారుణంగా కొట్టేవారు. ఒక చిన్న చీకటి గదిలో నిర్బంధించి, చెవులపై ఇనుప రాడ్లతో కొట్టేవారు. భోజనం కూడా సరిగ్గా ఇవ్వకపోవడంతో రోజుల తరబడి ఆకలితో ఉండాల్సి వచ్చేది.
ఈ జంట గత ఏడాది బిలియర్డ్స్ హాల్లో కలిసింది. ఆ అమ్మాయి తనను పెద్ద వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినదానిగా చెప్పేది. మయన్మార్‌లో తన కుటుంబ వ్యాపారం ఉందని ప్రియుడిని నమ్మబలికింది. చివరికి అతడిని తనతో కలిసి థాయిలాండ్‌కు తీసుకెళ్లి, అక్కడినుంచి మయన్మార్‌కు వెళ్లేలా చేసింది. అక్కడికే వెళ్ళిన తర్వాత అతన్ని సైబర్ ముఠాకు విక్రయించింది.
తన కుమారుడి ప్రాణాలు కాపాడుకోవడానికి కుటుంబం 350,000 యువాన్లు (సుమారు ₹36 లక్షలు) చెల్లించాల్సి వచ్చింది. ఈ జూన్‌లో అతను తిరిగి ఇంటికి చేరాడు. ఇదిలా ఉంటే, ప్రియురాలు థాయిలాండ్‌లో పది రోజుల సెలవులు గడిపిన తర్వాత చైనాకు తిరిగి వచ్చినప్పుడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
ఈ ఘటన చైనా అంతటా సంచలనం సృష్టించింది. ప్రియుడిని ప్రేమ పేరుతో మోసం చేసి అమ్మేసిన ఈ “కిలేడీ”పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
