Cyber Fraud: సైబర్ క్రైమ్ గురించి ఇప్పుడు ఎవరికీ వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. చదువుకున్న వారు, చదువుకోనివారు, సామాన్యులు, పెద్దమనుషులు అనే తేడా లేకుండా అందరూ ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఒక్క మెసేజ్ లేదా ఫోన్ కాల్తోనే బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తూ జనం నిత్యం ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ మోసగాళ్ల వలలో ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అల్లుడు పునీత్ పేరు వాడి పెద్ద మోసం జరిగి కలకలం రేపింది.
నారాయణ నిర్వహించే విద్యాసంస్థ అకౌంటెంట్‌కు సైబర్ నేరగాళ్లు మెయిల్ పంపారు. పునీత్ పేరుతో వచ్చిన ఆ మెసేజ్‌లో “అర్జెంట్‌గా రూ.1.96 కోట్లు అవసరం ఉంది. ఇది బిజినెస్ డీల్‌కు సంబంధించిన డబ్బు. వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి” అని రాశారు. మంత్రి అల్లుడు పేరుతో వచ్చిన మెసేజ్ కావడంతో అకౌంటెంట్ రెండోసారి ఆలోచించకుండా ఇచ్చిన ఖాతా నెంబర్‌కు డబ్బు పంపేశాడు. కొద్ది గంటల్లోనే అనుమానం వచ్చిన అకౌంటెంట్ యాజమాన్యానికి సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఇది సైబర్ క్రైమ్ అని స్పష్టమైంది. వెంటనే నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఈ మోసం చేసినట్లు గుర్తించారు. అందులో అరవింద్ కుమార్, సంజీవ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. రూ.1.96 కోట్లు మోసపోయినప్పటికీ, పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడంతో రూ.1.40 కోట్లు ఫ్రీజ్ చేయగలిగారు. మిగతా మొత్తాన్ని రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ఘటన మరోసారి నిరూపించింది ఏమిటంటే – సైబర్ నేరగాళ్లకు ఎవరూ మినహాయింపు కాదని. సాధారణ ప్రజలు మాత్రమే కాదు, మంత్రుల కుటుంబాలు కూడా ఈ మోసగాళ్ల ఉచ్చులో పడిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి ఇమెయిల్స్, మెసేజ్‌లు వచ్చినప్పుడు రెండుసార్లు ఆలోచించి, అధికారికంగా ధృవీకరించుకోవడం తప్పనిసరి.
