Suryapet: సూర్యాపేట జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బైక్పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులపై (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) కొందరు దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని కారులో వెంబడిస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించగా.. ముగ్గురు భయంతో సమీపంలోని ఒక వైన్ షాప్లోకి పరుగెత్తి ప్రాణాలను కాపాడుకున్నారు. షాప్లో ఉన్న జనాలు ఒక్కసారిగా బయటకు రావడంతో దుండగులు అక్కడి నుంచి కారు తీసుకుని పారిపోయారు. దీంతో ఆ ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Suryapet: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెంకు చెందిన దండుగల లక్ష్మయ్యకు సూర్యాపేటకు చెందిన గోపి అనే వ్యక్తి రూ.3 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అయితే గోపి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవడంతో ఇటీవల లక్ష్మయ్య గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.
దీని ప్రతీకారంగా గోపి, అతని స్నేహితులు కలిసి లక్ష్మయ్యపై దాడి చేయాలని యత్నించినట్టు సమాచారం. ఈ క్రమంలో లక్ష్మయ్య తన భార్యతో కలిసి పోలీస్స్టేషన్కు వెళ్తుండగా.. కారు ఎక్కిన దుండగులు వారి బైక్ను వెంబడించారు. తప్పించుకునే ప్రయత్నంలో లక్ష్మయ్య కుటుంబం బీబీగూడెం పరిధిలోని ఒక వైన్ షాప్ వద్ద బైక్ను వదిలేసి లోపలికి పరుగులు తీశారు.
దుండగులు కత్తులు, కర్రలతో షాప్ లోపలికి దూసుకెళ్లి దాడి చేయబోతుండగా.. అక్కడి జనాలు ఒక్కసారిగా బయటకు రావడంతో వారు భయపడి కారులో ఎక్కి పారిపోయారు. వెంటనే లక్ష్మయ్య కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
