Smuggling Gold: గత పదేళ్లలో దాదాపు 32 వేల కిలోల బంగారం స్వాధీనం భారతీయులకు బంగారానికి విడదీయలేని బంధం ఉంది. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నా, డిమాండ్ మాత్రం ఎప్పటికీ తగ్గడం లేదు. అంతేకాదు, దేశం తన బంగారం నిల్వలను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. విదేశాల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తూనే, మరోవైపు అక్రమ రవాణా ద్వారా దేశంలోకి వచ్చే పసిడి కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది. సరిహద్దులు, విమానాశ్రయాలు, వింత వింత పద్ధతులు ఉపయోగించి స్మగ్లర్లు బంగారం దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలు చూస్తే నిజంగానే ఆశ్చర్యపోవాల్సిందే. గత పదేళ్లలో (2015–2025) మొత్తం 31,772.34 కిలోల బంగారం సీజ్ చేసినట్లు వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 2023–24లోనే 4,971.68 కిలోలు పట్టుబడ్డాయి. ఈ దశాబ్దంలో మొత్తం 35,888 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
ఏఏ సంవత్సరాల్లో ఎంత బంగారం పట్టుబడిందంటే
- 2015–16 – 2,972.07 కిలోలు
- 2016–17 – 1,520.24 కిలోలు
- 2017–18 – 3,329.46 కిలోలు
- 2018–19 – 4,292.29 కిలోలు
- 2019–20 – 3,626.85 కిలోలు
- 2020–21 – 1,944.39 కిలోలు
- 2021–22 – 2,172.11 కిలోలు
- 2022–23 – 4,342.85 కిలోలు
- 2023–24 – 4,971.68 కిలోలు
- 2024–25 – 2,600.40 కిలోలు
ఈ లెక్కల ప్రకారం, కొన్ని సంవత్సరాల్లో కేసులు తగ్గినా, స్వాధీనం చేసిన బంగారం పరిమాణం ఎక్కువగా ఉండటం గమనార్హం.
సాధారణ పరిస్థితుల్లో పట్టుబడిన బంగారాన్ని ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తారు. అలాగే ఎన్నికల సమయంలో స్వాధీనం అయిన బంగారం కూడా ఐటీ శాఖదే అవుతుంది. నిజమైన యజమాని నిరూపణ లేకపోవడంతో, గత పదేళ్లలో స్వాధీనం చేసిన దాదాపు 32 వేల కిలోల బంగారం ఐటీ శాఖ దగ్గరే మిగిలిపోయింది. దీని అంచనా విలువ రూ. 32 వేల కోట్లు అని అధికారులు వెల్లడించారు.
ఈ గణాంకాలు చూస్తే, కొన్ని సంవత్సరాల్లో కేసుల సంఖ్య తగ్గినా, బంగారం స్వాధీనం పరిమాణం పెరగడం గమనించవచ్చు. దీనికి కారణం రవాణా మార్గాల్లో మార్పులు, సరిహద్దు తనిఖీల తీవ్రత, అంతర్జాతీయ బంగారం ధరల ప్రభావం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.
