Crime News: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో సంచలన సంఘటన చోటుచేసుకుంది. దోహా నుండి వచ్చిన ఓ విమానంలో ప్రయాణించిన నైజీరియన్ మహిళ వద్ద అధికారులు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ సందర్భంగా ఆమె వద్ద దాదాపు 2 కిలోల కోకైన్ బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.20 కోట్లుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Crime News: ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే చెన్నై ఎయిర్పోర్ట్లో భద్రతా తనిఖీలు కఠినంగానే ఉంటాయి. అయినప్పటికీ, కొంతమంది అక్రమ రవాణాకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో, రహస్య సమాచారాన్ని అందుకున్న సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ మరియు కస్టమ్స్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దోహా నుంచి వచ్చిన విమానంలో ప్రయాణించిన 30 ఏళ్ల నైజీరియన్ మహిళపై అనుమానం రావడంతో ఆమెను ఆపి చెక్ చేశారు.
ఆమె తన వద్ద ఉన్న లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, నల్లటి పొట్లాలు దొరికాయి. వాటిని పరీక్షించగా అవి కోకైన్గా తేలాయి. దీంతో మహిళను అదుపులోకి తీసుకొని, మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె చెన్నైలోని ఏదైనా ముఠాతో సంబంధం కలిగి ఉందా? లేక అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా గ్యాంగ్లో భాగమా? అన్న అంశాలను వెలికితీయడానికి విచారణ చేపట్టారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
