India US Trade: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ భారత్పై మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత్ రష్యా నుండి ముడి చమురు దిగుమతులను ఆపకపోతే, అమెరికా భారతీయ దిగుమతులపై 50 శాతం వరకు శిక్షాత్మక సుంకాలు విధిస్తుందని ఆయన తెలిపారు.
India US Trade: హాసెట్ మాట్లాడుతూ, భారత్ అమెరికన్ ఉత్పత్తులకు మార్కెట్లను తెరవడంలో మొండితనం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. భారతీయులు తమ వైఖరిని మార్చకపోతే, ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే అమెరికా బుధవారం నాటికి భారత వస్తువులపై సుంకాలను రెట్టింపు చేసి 50 శాతం వరకు పెంచింది. ఇది బ్రెజిల్ తప్ప మరే దేశానికీ లేని అత్యధిక సుంకం కావడం గమనార్హం. అదనంగా, భారత్ రష్యా ముడి చమురు కొనుగోలు చేస్తే 25 శాతం అదనపు సుంకం కూడా విధిస్తున్నట్టు ప్రకటించారు.
భారత్తో వాణిజ్య చర్చలు చాలా సంక్లిష్టమైనవి అని హాసెట్ అభిప్రాయపడ్డారు. రష్యాపై ఒత్తిడి పెంచి శాంతి ఒప్పందం సాధించడానికి, లక్షలాది ప్రాణాలను రక్షించడానికి అమెరికా కృషి చేస్తోందని అన్నారు. భారత్-అమెరికా వాణిజ్య చర్చలను ఒక మారథాన్ రేసుతో పోల్చుతూ, తుది లక్ష్యానికి చేరుకునే ముందు దీర్ఘకాలిక దృక్పథం, అంగీకారం అవసరం అని పేర్కొన్నారు.
