Rain Alert: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే కామారెడ్డి జిల్లా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో నీటమునిగిపోయింది. నిన్నటి కురిసిన వర్షాల వల్ల అనేక గ్రామాలు మునిగిపోయి, రవాణా అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మరో రెండు గంటల్లో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 62 నుంచి 87 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
హన్మకొండ, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు వెల్లడించారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
అదేవిధంగా హైదరాబాదు వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో స్థానికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని హెచ్చరించారు.
ప్రజలు అత్యవసర పనులు తప్ప బయటకు వెళ్లవద్దని, తక్కువ స్థాయిలో ఉన్న ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్లు దగ్గర నిలబడరాదని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే రెండు మూడు రోజులు వర్షాలు మరింత ఉధృతంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
