Viral News: ఆస్పత్రి పిల్లల వార్డులో విచిత్ర శబ్దాలు.. ఏంటా అని చూడగా షాక్!

Viral News: ఆసుపత్రులు అంటేనే పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి. కానీ మధ్యప్రదేశ్‌లోని ఆసుపత్రుల పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇండోర్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మహారాజా యశవంతరావు ఆసుపత్రిలో ఎలుకల బెడద తీవ్ర సమస్యగా మారింది. తాజాగా అక్కడి శిశు వార్డులో జరిగిన ఘటన తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Viral News: పిల్లల వార్డులో ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తూ, నవజాత శిశువులపై దాడి చేశాయి. సమాచారం ప్రకారం, ముగ్గురోజుల క్రితం పుట్టిన ఇద్దరు శిశువులను ఎలుకలు కొరికేశాయి. ఒక శిశువు చేతికి తీవ్రమైన గాయం కాగా, మరొకరి భుజంపై గాయమైంది. అదృష్టవశాత్తూ పిల్లలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు.

ఈ ఘటన వెలుగులోకి రాగానే ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే తల్లిదండ్రులు ఆసుపత్రి నిర్వహణ, పరిశుభ్రతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో శిశు బాక్స్‌లో ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.

గతంలో కూడా ఈ ఆసుపత్రిలో ఎలుకల బెడద గురించి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆసుపత్రి యాజమాన్యం ఇప్పటివరకు 12 వేలకుపైగా ఎలుకలను చంపించినప్పటికీ సమస్య తగ్గకపోవడం గమనార్హం. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా పరిస్థితి యథాతథంగా కొనసాగుతోంది.

ఈ ఘటనపై ఎంజీఎం మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ అర్వింద్ ఘనఘోరియా దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఫలితం ఇవ్వకపోవడం ఆసుపత్రి యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోంది.

నవజాత శిశువుల ప్రాణాలకే ముప్పు ఉన్న ఈ తరహా ఘటనలు జరగడం దారుణం. సంబంధిత అధికారులు ఎప్పటి వరకు కళ్ళు మూసుకుంటారు అన్న ప్రశ్న తల్లిదండ్రులు, ప్రజల మధ్య పెద్ద చర్చగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *