Made In India: తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్ అందుకున్న ప్రధాని మోదీ

Made In India: భారతదేశం సెమీకండక్టర్ల రంగంలో వేగంగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (సెప్టెంబర్ 2, 2025) నాడు ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలో తయారు చేసిన తొలి “మేడ్ ఇన్ ఇండియా” చిప్‌ను కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాని మోదీకి అందజేశారు.

Made In India: ఈ సందర్భంగా మంత్రి వైష్ణవ్ విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్ తో పాటు, నాలుగు ఆమోదం పొందిన ప్రాజెక్టుల టెస్ట్ చిప్‌లను కూడా ప్రధానికి అందించారు. ఇది దేశ సాంకేతిక రంగానికి ఎంతో గర్వకారణం.

సెమీకండక్టర్లు ఆరోగ్య సంరక్షణ, రవాణా, కమ్యూనికేషన్, రక్షణ, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో వినియోగించబడుతున్నాయి. చైనా-అమెరికా మధ్య పోటీ కూడా ప్రధానంగా చిప్ పర్యావరణ వ్యవస్థ చుట్టూ తిరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రపంచ దేశాలు అన్ని సెమీకండక్టర్లలో స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తున్నాయి.

ఈ దిశలో భారత్ కూడా దూసుకుపోతుంది. 2021 నుండి ఇప్పటివరకు దేశంలో 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటికి కలిపి 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఐదు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు.

ప్రధాని మోదీ దార్శనికతతో ప్రారంభమైన ఈ ఇండియా సెమీకండక్టర్ మిషన్ కేవలం 3.5 సంవత్సరాల్లోనే ప్రపంచం నమ్మకం ఉంచే స్థాయికి చేరుకుందని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. “ఇప్పుడే మొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్‌ను ప్రధానికి అందించాము.. ఇది భారత టెక్నాలజీ భవిష్యత్తుకు చారిత్రాత్మక క్షణం” అని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *