Supreme Court: తెలంగాణలో వైద్య ప్రవేశాల్లో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వమే జారీ చేసిన జీవో 33కు మద్దతు పలుకుతూ, ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో 85% స్థానిక కోటా కింద ప్రవేశం పొందాలంటే తప్పనిసరిగా ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివి ఉండాలని స్పష్టం చేసింది.
Supreme Court: హైదరాబాద్ హైకోర్టు ఇంతకుముందు ఈ జీవోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, శాశ్వత నివాసులకు ఇది వర్తించదని తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత ధర్మాసనం రాష్ట్ర వాదనను సమర్థించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
అయితే ఉద్యోగరీత్యా బదిలీల కారణంగా రాష్ట్రం వెలుపల చదవాల్సిన పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సంస్థలు, అఖిల భారత సర్వీసులు, కార్పొరేషన్లు, సాయుధ బలగాల ఉద్యోగుల పిల్లలకు మాత్రం మినహాయింపు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో తెలంగాణలో మెడికల్ కోర్సుల అడ్మిషన్లకు ఉన్న అడ్డంకులు తొలగాయి. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 10 నాటికి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అఖిల భారత కోటా కౌన్సెలింగ్ పూర్తయిన నేపథ్యంలో, రాష్ట్ర స్థాయిలో కౌన్సెలింగ్ త్వరలో జరగనుంది.
ప్రస్తుతం తెలంగాణలో 61 మెడికల్ కళాశాలల్లో 8,340 ఎంబీబీఎస్ సీట్లు, అలాగే 12 డెంటల్ కళాశాలల్లో 1,140 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ తీర్పుతో స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యం మరింతగా లభించనుంది.
