Lady Don: నెల్లూరు లేడీ డాన్గా పేరు గాంచిన నిడిగుంట అరుణ చుట్టూ కేసులు ఉక్కుపాదంలా బిగుస్తున్నాయి. వరుస కేసులతో ఆమెపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. తాజాగా మరో కేసు నమోదవ్వడం నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది.
Lady Don: నవాబుపేటకు చెందిన శశికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు అరుణపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నదమ్ముల ఆస్తి వివాదంలో తలదూర్చి, గన్తో తనను బెదిరించిందని ఆయన ఆరోపించారు. దీంతో లేడీ డాన్ అరుణపై మరొక క్రిమినల్ కేసు చేరింది.
కేసు దర్యాప్తులో భాగంగా కోవూరు పోలీసులు అరుణ అనుచరులు పల్లం వేణు, అంకిం రాజా, షేక్ అప్సర్, షేక్ మునీర్, మచ్చకర్ల గణేష్, ఎలిషాలను విచారించారు. అరుణ దందాలు, బెదిరింపులు, అక్రమ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు సేకరించారు.
సాయి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఆక్రమణ కేసులో ఇటీవల అరుణతో పాటు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, అది రేపటితో ముగియనుంది. దీంతో పోలీసులు మళ్లీ అరుణను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఇటీవల 19న కోవూరు పరిధిలోని ఒక బిల్డర్ను బెదిరించిన కేసులో అరుణ అరెస్ట్ అయ్యింది. రౌడీషీటర్ శ్రీకాంత్ గ్యాంగ్తో కలిసి ఆమె చేసిన దందాలు, దౌర్జన్యాలపై పోలీసులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ముఖ్యంగా గూడూరు, సూళ్లూరుపేట, నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో ఆమె సెటిల్మెంట్లు, అరాచకాలు పోలీసులకు బహిర్గతమయ్యాయి.
గత నాలుగైదేళ్లుగా అరుణ నెల్లూరు సహా పలు ప్రాంతాల్లో దందాలను నడిపినట్టు పోలీసులు గుర్తించారు. రౌడీషీటర్ శ్రీకాంత్ భార్య అని చెప్పుకుంటూ దందాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా శ్రీకాంత్ పెరోల్ కోసం రాజకీయ, పోలీసు వ్యవస్థలను మేనేజ్ చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
నిడిగుంట అరుణ అరాచకాలపై హోంమంత్రి అనిత ఇప్పటికే స్పందించారు. దీంతో అరుణపై పోలీసుల యాక్షన్ మరింత వేగవంతం అవుతుందని తెలుస్తోంది.
