Haryana Police: లాకప్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌..కోర్టు ఆగ్రహానికి కారణం!

Haryana Police: సాధారణంగా లాకప్‌లో నేరస్థులు కనిపిస్తారు. కానీ ఒక పోలీస్ అధికారి, అది కూడా యూనిఫామ్‌లో లాకప్‌లో ఉండడం ఆశ్చర్యకరమే. ఇలాంటిదే హర్యానా రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Haryana Police: హర్యానా రాష్ట్రం కైథల్ జిల్లా కోర్టులో ఓ హత్య కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ హాజరు కావాల్సి ఉంది. ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఆయన అరగంట ఆలస్యంగా 10:30కి కోర్టుకు చేరుకున్నారు. కోర్టు సమయాన్ని లెక్కచేయకుండా ఆలస్యంగా రావడంతో అదనపు సెషన్స్ జడ్జి మోహిత్ అగర్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో, ఇన్‌స్పెక్టర్ రాజేష్‌ను 10:30 నుంచి 11:30 గంటల వరకు కోర్టు లాకప్‌లో ఉంచాలని జడ్జి ఆదేశించారు. అంతేకాకుండా ఆయన జీతాన్ని కూడా కోర్టుకు సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇన్‌స్పెక్టర్ రాజేష్ నిర్లక్ష్యం ఇది తొలిసారి కాదని సమాచారం. గతంలో కూడా కోర్టు ఆదేశాలను అతిక్రమించడంతో ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హైకోర్టు ఈ కేసును త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశించినప్పటికీ, ఇన్‌స్పెక్టర్ సహకరించకపోవడంతో విచారణ వాయిదా పడుతూ వచ్చింది.

దీంతో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు కఠిన చర్యలు తప్పవని జడ్జి హెచ్చరించారు. లాకప్‌లో గంట గడిపిన తర్వాత ఇన్‌స్పెక్టర్ రాజేష్ సాక్ష్యం చెప్పడానికి హాజరయ్యారు. విచారణ పూర్తైన తర్వాత ఆయనను విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *