Anakapalli: ప్రేమ కోసం చెన్నై వెళ్లిన యువకుడు.. అనుమానాస్పద మృతి కలకలం!

Anakapalli: అనకాపల్లి జిల్లా యువకుడి మృతి ప్రస్తుతం తీవ్ర విషాదం ఇంకా  అనుమానాలకు దారితీసింది. ప్రేమించిన అమ్మాయిని కలుసుకోవడానికి సరదాగా చెన్నైకి వెళ్లిన యువకుడు, ఆ తర్వాత ఊహించని ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. భవనం పై నుంచి పడి మృతి చెందిన అతడి మరణం వెనుక హత్యా? లేక ఆత్మహత్యా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.

Anakapalli: వివరాల్లోకి వెళ్తే, దేవరాపల్లి మండలానికి చెందిన నవీన్‌ అనే యువకుడు బుధవారం సాయంత్రం చెన్నై కోయంబేడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భవనం పై నుంచి పడి మృతి చెందాడు. గురువారం ఉదయం అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఈ ఘటనతో అనకాపల్లి జిల్లాలో కలకలం రేగింది.

నవీన్‌కు రాంబిల్లి మండలం వెంకటాపురానికి చెందిన యువతితో ప్రేమాయణం కొనసాగుతోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నవీన్‌ను హత్య చేసి ఉంటారనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు మూలమని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. యువతి కుటుంబ సభ్యులపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Narendra Modi: విద్యార్థిగా నరేంద్ర మోదీ ఎలా ఉండేవారు.. గురువుల జ్ఞాపకాలలో ఆసక్తికర విషయాలు..!

‘‘8న స్కూల్‌ ఫ్రెండ్స్‌తో కలిసి టూర్‌కి వెళ్తున్నానని చెప్పాడు. కానీ గురువారం మృతుడయ్యాడన్న సమాచారం అందింది. రైలు టికెట్‌లో రూప, ఆమె తల్లి కూడా ప్రయాణం చేశారని తెలిసింది. నవీన్‌ మొబైల్ ధ్వంసం అయింది. పథకం ప్రకారమే తీసుకెళ్లి హత్య చేశారని మా అనుమానం’’ అని మృతుడి పెదనాన్న వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు.

నవీన్‌ మృతిపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ‘‘హత్య అయితే నిందితులు బయటపడాలి.. ఆత్మహత్య అయితే కారణం ఏమిటో బయటపడాలి. మాకు న్యాయం జరగాలి’’ అని ఆయన మేనమామ వాసు అన్నారు.

ప్రస్తుతం చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో నవీన్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అంత్యక్రియలు ఇప్పటికే నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *