La Nina Effect: నేటి పర్యావరణ మార్పుల కారణంగా వాతావరణం మరింత కఠినంగా మారుతోంది. సగటు ఉష్ణోగ్రతలు సంవత్సరానికొకసారి పెరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రత్యేక పరిస్థితులు చలితీవ్రతను పెంచుతున్నాయి. ఈ రుతుపవన కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు శీతాకాలం దగ్గరపడుతుండటంతో వాతావరణ నిపుణులు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఈసారి శీతాకాలం సాధారణం కంటే ఎక్కువ చల్లగా ఉండొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లా నినా ప్రభావం కారణంగా ఎముకలు కొరికేంత చలి ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అక్టోబర్–డిసెంబర్ మధ్యకాలంలో చలితీవ్రత పెరగడానికి 71% అవకాశముందని యుఎస్ క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ (CPC) వెల్లడించింది. అయితే, ఈ సంభావ్యత డిసెంబర్ 2025–ఫిబ్రవరి 2026 నాటికి 54%కు తగ్గుతుందని తెలిపింది. అయినప్పటికీ, లా నినా ప్రభావం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: New Trend: కుక్క పిల్ల కావాలా నాయనా.. పట్టణాల నుంచి పల్లెలకు పాకిన కొత్త ట్రెండ్!
లా నినా అంటే ఏమిటి? ఇది ఎల్ నినో–దక్షిణ ఆసిలేషన్ (ENSO)లోని చల్లని దశ. ఇందులో పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతం ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. భారతదేశంలో లా నినా పరిస్థితులు వస్తే శీతాకాలం సాధారణం కంటే చల్లగా ఉండి, ఉత్తర భారతదేశం, హిమాలయ ప్రాంతాల్లో భారీ హిమపాతం సంభవించే అవకాశం ఉంటుంది.
స్కైమెట్ వెదర్ అధ్యక్షుడు జి.పి. శర్మ ప్రకారం, ప్రస్తుతం పసిఫిక్ సముద్రం సాధారణం కంటే చల్లగా ఉంది. కానీ, లా నినాను అధికారికంగా ప్రకటించడానికి అవసరమైన ప్రమాణాలు ఇంకా చేరుకోలేదని చెప్పారు. అయినప్పటికీ, ప్రస్తుత శీతల దశ కూడా ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
వాతావరణ నిపుణులు చెబుతున్న ప్రకారం, ఈ ఏడాది శీతాకాలం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ముందుగానే ప్రజలు గీజర్లు, దుప్పట్లు, వింటర్ డ్రెస్సులు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.
