Indigo Flight: ఆదివారం (సెప్టెంబర్ 14) ఉత్తరప్రదేశ్లోని లక్నో విమానాశ్రయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో రన్వేపై వేగంగా పరిగెత్తింది. కానీ గాల్లోకి ఎగరబోయే క్షణంలోనే సమస్య తలెత్తింది. ఈ సమయంలో పైలట్ చాకచక్యంగా స్పందించి విమానాన్ని రన్వే ముగిసేలోపు ఆపివేశారు. దీంతో 151 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
Indigo Flight: ఈ విమానంలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సతీమణి, కన్నౌజ్ ఎంపీ డింపుల్ యాదవ్ కూడా ఉన్నారు. క్షణాల్లో పెను ప్రమాదం తప్పటంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కానీ విమాన సిబ్బంది అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తరువాత ప్రయాణికులను మరో విమానం ద్వారా ఢిల్లీకి పంపారు.
ఇది కూడా చదవండి: La Nina Effect: ఇప్పుడే గీజర్లు, దుప్పట్లు సిద్ధం చేసుకోండి.. ఈ యేడు శీతాకాలంపై నిపుణుల హెచ్చరిక..!
ఇటీవల ఇండిగో విమానాలకు వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం సూరత్–దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పైలట్ అత్యవసర చర్యగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ విమానంలో 170 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.
అధికారుల ప్రకారం, అది అత్యవసర ల్యాండింగ్ కాకపోయినా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అనంతరం ఇండిగో మరో విమానం ఏర్పాటు చేసి, ప్రయాణికులందరినీ సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరవేసింది.
