Rajendranagar: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. కిస్మత్ పూర్ ప్రాంతంలోని మూసీ నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహం మీద దుస్తులు లేకపోవడంతో ఇది అత్యాచారం అనంతరం హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Rajendranagar: స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమిక పరిశీలనలో మృతురాలి వయసు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో హత్య జరిగి రెండు మూడు రోజులు అయి ఉంటుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: AI Restaurant: బయట భోజనం చేసేవారికి షాక్.. ఫ్లోర్ ఊడ్చిన చెత్త కూడా వండిన ఆహారంలో..!
రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో మాట్లాడుతూ, “మహిళను ఎక్కడో హత్య చేసి కిస్మత్ పూర్ ప్రాంతంలో పడవేసినట్టు అనిపిస్తోంది. మృతదేహం దొరికిన ప్రాంతానికి సమీపంలో సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటిని పరిశీలిస్తున్నాం. మిస్సింగ్ కేసుల ఆధారంగా మృతురాలి వివరాలను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం” అని అన్నారు.
ప్రస్తుతం పోలీసులు రేప్ అండ్ మర్డర్ కోణంలో విచారణ జరుపుతున్నారు. కిస్మత్ పూర్ బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పద కదలికలపై సీసీ ఫుటేజ్ సేకరిస్తున్నారు. అలాగే సమీప పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన మిస్సింగ్ కేసులను క్రాస్ చెక్ చేస్తున్నారు.
ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతురాలి గుర్తింపు, హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు త్వరలోనే బయటపడనున్నాయని పోలీసులు వెల్లడించారు.
