Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చేతులు కట్టేసి భార్యపై చిత్రహింసలు, వీడియో వైరల్!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలో భర్త తన భార్యను చేతులు కట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు తక్షణమే స్పందించి కేసు నమోదు చేశారు.

Andhra Pradesh: మద్యానికి బానిసైన బాలాజీ, తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని తరచుగా వేధింపులకు పాల్పడేవాడని స్థానికులు తెలిపారు. సుమారు 8 సంవత్సరాల క్రితం బాలాజీ, భాగ్యలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. కానీ పెళ్లి తర్వాత నుండి బాలాజీ మద్యానికి బానిసై భార్యను తరచూ హింసించేవాడు.

ఇది కూడా చదవండి: Viral Video: పంక్చర్‌ ప్రాబ్లమ్‌కు శాశ్వత పరిష్కారం.. లైఫ్‌టైమ్‌ గ్యారెంటీ టైర్స్..!

కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో మరో మహిళతో సహజీవనం చేస్తున్న బాలాజీ, అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి భార్య సంపాదించిన డబ్బులను లాగేసేవాడని సమాచారం. ఈసారి కూడా భార్య వద్ద డబ్బులు అడిగిన అతను, ఇవ్వలేదన్న కారణంతో తీవ్ర ఆగ్రహానికి గురై ఆమెను తాళ్లతో కట్టి బెల్టు, కర్రలతో దారుణంగా కొట్టాడు. అంతేకాదు, ఈ మొత్తం ఘటనను వీడియోగా రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు.

సంఘటన సమయంలో స్థానికులు అక్కడికి చేరుకొని మహిళను కాపాడారు. వెంటనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ విచారణకు ఆదేశించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బ్రహ్మనాయుడు బాధితురాలు భాగ్యలక్ష్మి నుంచి వివరాలు సేకరించారు.

ప్రస్తుతం పోలీసులు బాలాజీతో పాటు అతనికి సహకరించిన మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను కాపాడాల్సిన భర్తే ఇలాంటి దారుణానికి పాల్పడటం సమాజానికి మచ్చ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళా సంఘాలు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *