Amaravati: బిజీయెస్ట్ సిటీగా మారబోతున్న అమరావతి.. సీఆర్డీఏ సమావేశంలో కీలక ప్రతిపాదనలు!

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాబోయే రోజుల్లో కొత్త ఐకానిక్ ప్రాజెక్టులతో అత్యంత బిజీయెస్ట్ సిటీగా రూపుదిద్దుకోనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం శరవేగంగా నిర్మాణ పనులను పూర్తి చేస్తూ, మౌలిక సదుపాయాల కల్పనలో దూసుకుపోతోంది. తాజాగా జరిగిన 51వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

Amaravati: ప్రభుత్వం అమరావతి రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ₹904 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో నీటి సరఫరా కోసం ₹64 కోట్లు, సీవరేజ్ కోసం ₹110 కోట్లు, రహదారుల నిర్మాణానికి ₹300 కోట్లు, వీధి దీపాలకు ₹12 కోట్లు కేటాయించారు. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్‌ను 78 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు భూసేకరణకు ఆమోదం తెలిపారు. దాదాపు ₹5 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించబోయే ఈ పార్క్ ద్వారా 20 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

ఇది కూడా చదవండి: Tamilnadu Election: డీఎంకేకు చెక్ పెట్టేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త మలుపు!

రాజధాని రైతుల అభ్యర్థన మేరకు రిటర్నబుల్ ప్లాట్స్‌లో ‘అసైన్ భూమి’ అనే పదాన్ని తొలగించాలన్న ఆదేశం సీఎం చంద్రబాబు ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే, అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలు ప్రాజెక్టులు స్పెషల్ పర్పస్ వెహికల్ కింద చేపట్టేందుకు అనుమతులు ఇచ్చారు. నీటి సరఫరా, శుద్ధి కోసం రూ.411 కోట్లతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మరో రూ.376 కోట్లతో సరఫరా ప్యాకేజీకి ఆమోదం తెలిపారు. అదనంగా, SRM, VIT యూనివర్శిటీలకు మెడికల్, డెంటల్, పారామెడికల్ కళాశాలల కోసం చెరో 100 ఎకరాల భూమి కేటాయించారు.

కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్ వంతెనకు ప్రత్యేక డిజైన్ ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమలను ప్రతిబింబించే డిజైన్లను కూడా పరిశీలించాలని సూచించారు.మొత్తం మీద, అమరావతిని ప్రపంచస్థాయి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే అమరావతి నిజంగానే దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత బిజీయెస్ట్ సిటీలలో ఒకటిగా మారే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *