Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి తీరాన్ని దాటే దశలో ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 40–60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Weather Report: ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా మధ్య నేడు వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని స్పష్టంగా హెచ్చరిక ఇచ్చారు.
గోదావరి నది నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం 37 అడుగుల ఎత్తులో నీటిమట్టం నమోదు అయింది. దిగువకు సుమారు 6 లక్షల 72 వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. భద్రాచలం నుంచి పోలవరానికి వరద జలాలు చేరుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇది కూడా చదవండి: Trump: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం.. శాంతి కోసం ట్రంప్ కీలక ముందడుగు
తెలంగాణలో కూడా భారీ వర్షాల సూచన ఉంది. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా 30 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
హైదరాబాద్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో GHMC, పోలీసు విభాగాలు అప్రమత్తమయ్యాయి. సైబరాబాద్ పోలీసులు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో, అవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
భారీ వర్షాల కారణంగా గుజరాత్లో 19, 20 తేదీల్లో మితిమీరిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముంబైలో వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, హిమాచల్ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడి 15 పంచాయతీలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది.
