Hyderabad Cybercrime: సైబర్‌క్రైమ్‌ పోలీసుల సంచలన ఆపరేషన్‌.. 14 రాష్ట్రాల్లో నిందితులు అరెస్ట్!

Hyderabad Cybercrime: హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు మరోసారి తమ శక్తిని చాటుకున్నారు. దేశవ్యాప్తంగా అమాయకులను ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో మోసం చేస్తున్న భారీ సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను కూలదోసారు. ప్రత్యేక ప్రణాళికతో చేసిన ఆపరేషన్‌లో 14 రాష్ట్రాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించి 61 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad Cybercrime: ఈ ఆపరేషన్‌లో భాగంగా నిందితుల వద్ద నుంచి భారీ స్థాయిలో నేరాలకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పెద్ద సంఖ్యలో మొబైల్‌ ఫోన్లు, చెక్‌బుక్స్‌, ఏటీఎంలు ఉన్నాయి. అంతేకాదు, మోసపోయిన బాధితుల ఖాతాల్లోకి ఇప్పటివరకు రూ.1.01 కోట్లు తిరిగి జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇది సైబర్ మోసాల కేసుల్లో ఇప్పటివరకు తిరిగి ఇచ్చిన మొత్తాల్లో అత్యధికం కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Viral Video: బిజీ రోడ్డు మధ్యలో పరుపుపై హాయిగా నిద్ర.. ట్రాఫిక్ స్తంభనతో షాక్!

పోలీసుల వివరాల ప్రకారం, ఈ గ్యాంగ్‌ ప్రధానంగా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌ ద్వారా ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫర్ల పేరుతో ప్రజలను ఉచ్చులోకి దింపుతోంది. మొదట చిన్న పెట్టుబడి పెట్టిస్తారు. దానిపై లాభాలు చూపించి, ఆపై పెద్ద మొత్తంలో డబ్బు పెట్టేలా ప్రలోభపెడతారు. చివరికి సైట్ లేదా యాప్‌ను మూసివేసి పారిపోతారు. ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో లక్షలాది మందిని మోసం చేసినట్లు తేలింది.

సైబర్ పోలీసులు మాత్రం మోసపోయిన వారికి హోప్‌ ఇచ్చారు. ఇప్పటివరకు వసూలైన మొత్తాన్ని తిరిగి అందజేయడానికి చర్యలు చేపట్టారు. బాధితుల ఖాతాల్లోకి 1.01 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.

అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. “ఆన్‌లైన్‌లో అధిక లాభాలు వస్తాయని చెప్పే ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫర్లకు ఆకర్షితులవ్వకండి. తెలియని లింక్స్‌, యాప్స్‌ ద్వారా డబ్బు పెట్టడం మోసాలకు దారితీస్తుంది” అని సూచించారు. ఎలాంటి సందేహాలైనా ఉంటే సైబర్‌ హెల్ప్‌లైన్‌ 1930 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

ఈ సంచలన ఆపరేషన్‌తో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ విభాగం మరోసారి నేరగాళ్లకు గట్టి చెక్‌ వేసింది. టెక్నాలజీ పెరిగేకొద్దీ నేరాల రూపం మారుతున్నా.. వాటిని ఎదుర్కోవడానికి సైబర్ పోలీసులు తమ నైపుణ్యాన్ని మరింత పెంచుతున్నట్లు స్పష్టమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *