Haryana: హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు **“లడ్లీ లక్ష్మీ యోజన”**ను అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన మహిళలకు ప్రతినెలా రూ.2,100 చెల్లించనున్నారు.
Haryana: సెప్టెంబర్ 25 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అధికారికంగా ఈ యాప్ను ఆవిష్కరించనున్నారు. కురుక్షేత్ర డీసీ విశ్రామ్ కుమార్ మీనా వివరాలు వెల్లడిస్తూ, సంవత్సరానికి కుటుంబ ఆదాయం రూ.1 లక్షలోపు ఉన్న మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారని తెలిపారు.
లడ్లీ లక్ష్మీ పథకం ప్రయోజనం పొందాలంటే మహిళలకు ప్రత్యేక డాక్యుమెంటేషన్ అవసరం. లబ్ధిదారురాలి పేరుమీద కరెంట్ బ్యాంక్ ఖాతా తప్పనిసరి. చెల్లింపులు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా జరుగుతాయి.
ఈ పథకం వర్తించాలంటే మహిళ వివాహిత అయినా లేదా అవివాహిత అయినా 23 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అదేవిధంగా హర్యానాలో 15 సంవత్సరాలు నివసించి ఉండటం తప్పనిసరి. అయితే ఇప్పటికే వృద్ధాప్య గౌరవ వేతనం, వితంతువుల పింఛన్, నిరాశ్రయుల సహాయం, వికలాంగుల పథకం, యాసిడ్ దాడి బాధితుల సహాయం వంటి ఇతర ప్రభుత్వ పథకాలు పొందుతున్నవారు దీనికి అర్హులు కారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఈ పథకానికి దూరం.
కానీ క్యాన్సర్, హిమోఫిలియా, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న మహిళలు ప్రస్తుతం ఇతర పథకాల ప్రయోజనాలు పొందుతున్నా, లడ్లీ లక్ష్మీ యోజన కింద కూడా లబ్ధి పొందగలరు. ముఖ్యంగా మూడవ, నాల్గవ దశలలో ఉన్న రోగులు అర్హులుగా పరిగణిస్తారు.
దరఖాస్తు చేయదలిచిన మహిళలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్, కుటుంబ ID, పాస్పోర్ట్ సైజు ఫోటోలు వంటి పత్రాలు సమర్పించాలి.
ఈ పథకం రాష్ట్రంలోని పేద మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
