Kanyakumari Movie Review: ఆహా.. కన్యాకుమారి! కళ్ళతోనే కట్టిపడేస్తుంది!

Kanyakumari Movie Review: మీరు సినిమా అభిమానా? మంచి సినిమాలు వస్తే వదలకుండా చూస్తారా? అయితే.. మీరు కచ్చితంగా ఈ మూవీని థియేటర్లో చూసి ఉండాలి. ఒకవేళ చూడలేకపోయి ఉంటే.. ఇప్పుడు ఓటీటీలో వచ్చింది వెంటనే చూసేయండి. ఎందుకంటే, నాతో సహా చాలామంది  ఈ మధ్య ఒక చిన్న సినిమా మిస్ అయ్యారు. దీంతో థియేటర్లలోకి ఇలా వచ్చి.. అలా వెళ్ళిపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని ఆ మూవీ మన ముందుకు వచ్చింది. పోయిన శుక్రవారం స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మూవీ చూసిన వాళ్లంతా అబ్బా సినిమా భలే ఉందే అంటున్నారు. ఆ సినిమా గురించి ఇప్పుడు చెప్పేసుకుందాం. ఆ మూవీ పేరు కన్యాకుమారి. దర్శకుడు సృజన్ అట్టాడ. 

Kanyakumari Movie Review: ఒక ప్రేమకథను వెండితెర మీద చూపించాలంటే.. మంచి డ్యూయెట్స్.. రెండు మూడు హాట్ ముద్దు సీన్స్.. కథకు సంబంధం లేకుండా వచ్చే కామెడీ ట్రాక్స్.. ఇవన్నీ తప్పనిసరి అనే ముద్ర పడిపోయింది. సాధారణంగా ప్రేమ కథలకు ఒకటే లైన్ ఇద్దరు యువతీ యువకులు.. కాలేజీలోనో.. పక్క పక్క ఇళ్ళలోనో ప్రేమించేసుకుంటారు.. సరిగ్గా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి విలన్ ఎంట్రీ లేదా పెద్దల గోల.. ఒక్కోసారి ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవడం తరువాత సుఖాంతమో.. దుఃఖంతమో అయిపోవడం. అంతే. కన్యాకుమారి కూడా అదే పంథా. కానీ.. కథా నేపధ్యం.. కథనం.. నటీనటుల నటన.. కథకు సరిపోయే సంగీతం.. కళ్ళకు విందుగా ఫొటోగ్రఫీ వీటన్నిటి నేతతో కన్యాకుమారి సమ్ థింగ్ స్పెషల్ అనిపిస్తుంది. 

Kanyakumari Movie Review: కథ విషయానికి వస్తే.. ఒక అబ్బాయి.. రైతు కావాలని చదువు మధ్యలోనే మానేస్తాడు. ఒక అమ్మాయి బాగా చదువుకోవాలని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలని ప్రయత్నించి కుటుంబ పరిస్థితుల కారణంగా ఒక బట్టల షాపులో పని చేస్తుంటుంది. రైతే రాజు అని నమ్మే ఆ అబ్బాయికి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయడమే లక్ష్యంగా ఉన్న ఆ అమ్మాయికి మధ్యలో ప్రేమ పుడుతుంది. మరి వారిద్దరి ప్రేమ పెళ్లి తీరానికి చేరిందా? పూర్తి విరుద్ధమైన కెరీర్ దారుల్లో వెళుతున్న ఆ ఇద్దరూ ఒక్కటవడానికి ఏదైనా జంక్షన్ దొరికిందా? ఇదే కథ. 

Kanyakumari Movie Review: ఇక ఈ స్టోరీని చక్కగా సెల్యులాయిడ్ మీదకు తీసుకు వచ్చిన సృజన్ చాలా హుందాగా.. ఎక్కడా అసభ్యత కనిపించనీయకుండా.. ఏ మాత్రం విసుగు రానీయకుండా కథనాన్ని ఆహ్లాదంగా తీసుకుపోయారు. రైతు ప్రాధాన్యాన్ని వివరిస్తూ సాగే సీన్స్.. ఆడపిల్లకు చదువెందుకు అనే కుటుంబం నుంచి ఎలాగైనా సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావాలనే ఆశతో.. ఊగిసలాడే మనసుతో ఉండే అమ్మాయి అనుభవాలు.. వీటిని ఆవిష్కరించిన తీరు చాలా బావుంటుంది.ఇష్టం వేరు.. జీవిత లక్ష్యం వేరు అంటూ ఆ అమ్మాయి చెప్పే ఒక్క మాటతో ఆమె అంతరంగాన్ని విశదీకరించి.. నీకోసం నేను త్యాగం చేయాలా? నాకోసం నువ్వేమీ చెయ్యవా? అని ప్రశ్నించిన అబ్బాయి తనకు ఇష్టమైన అమ్మాయి కోసం తన ప్రేమను పక్కన పెట్టి తన పనిలోనే ప్రేమను చూసుకుంటూ ఎదిగిన క్రమం.. ఇలా సృజనాత్మకంగా ఈ ప్రేమకథను నడిపించారు సృజన్. సినిమా మొదటి సీన్ నుంచే మనల్ని తన చేయిపట్టుకుని ఆ ప్రేమకథలోకి లాక్కెళ్లిపోయారు. చకచకా సీన్స్ పరిగెడుతూనే ఉంటాయి. కథనంలో భాగంగా వచ్చే సున్నితమైన హాస్యం.. హీరోహీరోయిన్స్ మధ్య కనీసం ఒకరిని ఒకరు తాకకుండా నడిచే రొమాన్స్.. మొండిగా కనిపించే అమ్మాయి గుండెలోతుల్లోని వేదన.. ప్రతి అంశాన్ని మన మనసులు తాకేలా చెబుతూ కథనం వడివడిగా వెళ్ళిపోతుంది. సినిమా అన్నాకా కొన్ని అతిశయాలు తప్పవు కదా.. ఈ మూవీలోనూ అవి ఉన్నాయి. కానీ, ఓవరాల్ గా సినిమాకు ఉన్న గొప్పతనం మధ్య అవి మన దృష్టిని పెద్దగా ఆకర్షించవు. ఆలోచించనీయవు. సృజన అట్టాడ దర్శకుడిగా తన పూర్తి స్థాయి టాలెంట్ ని ఆవిష్కరించినట్టు మూవీ ఉంటుంది. 

Kanyakumari Movie Review: ఇక నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్ గా చేసిన గీత్ సైని నటన మనల్ని కట్టిపడేస్తుంది. కన్యాకుమారిగా కచ్చితంగా సరిపోయింది గీత్. పల్లెటూరి అమ్మాయిలా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావాలనుకునే పట్టుదల ఉన్న అమ్మాయిగా.. బట్టల షాపులో చీరలు అమ్ముకునే అమ్మాయిగా.. విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర కన్యాకుమారి. దానిని చాలా ఈజీగా చేసేసింది. కొన్ని చోట్ల కేవలం కళ్ళతోనే ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మనల్ని కట్టిపడేస్తాయి. ఎక్కడా కొత్త నటి అని అనిపించదు. సినిమా అంతా ఆమె నటనతో మనల్ని ఆకట్టుకుంటుంది. ఇక హీరోగా చేసిన కొత్త నటుడు శ్రీ చరణ్ కూడా చాలా బాగా చేశాడు. రైతుగా జీవించాలనే ఆకాంక్ష.. ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేయాలనే తపన.. ఇలా తన పాత్రలోని వైవిధ్యాల్ని బాగానే చూపించాడు. ఈ ఇద్దరికీ మంచి ఫ్యూచర్ ఉందనిపిస్తుంది. 

ఇక ఫొటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఇక సినిమాలో చెప్పుకోవలసింది డైలాగ్స్. శ్రీకాకుళం యాసలో వచ్చే డైలాగులు సూపర్ గా ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ డైలాగ్స్.. దానికి ఆమె ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. 

Kanyakumari Movie Review: మొత్తంగా చూస్తే సృజన్ తనదైన శైలిలో మామూలు ప్రేమకథను విభిన్నంగా చూపించారని చెప్పాలి. ప్రేమకథలో కూడా అంతర్లీనంగా మెసేజ్ ఇవ్వవచ్చు. అది కూడా ప్రేక్షకులకు పట్టుకుంటుంది అని ఈ మూవీ చూస్తే అర్ధం అవుతుంది. ఈ సినిమా ఓటీటీలో చూశాకా.. అయ్యో థియేటర్లో ఎందుకు మిస్ అయ్యామా? అనిపిస్తుంది. పెద్దతెరమీద చూడాల్సిన చిన్న సినిమా.. బుల్లితెర మీద ఇప్పుడు సందడి చేస్తోంది. ఆలస్యం చేయకుండా వెంటనే చూసేయండి. మనసంతా కాసేపు హాయిగా రిలాక్స్ అయిపోతుంది. 

  • KVD వర్మ, డిజిటల్ క్రియేటర్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *