High Court: నెల్లూరుకు చెందిన సౌందర్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మఫ్టీలో వెళ్లి అరెస్టు చేయడం ఏంటని, పోలీసులు యూనిఫాం లేకుండా అక్రమంగా వ్యవహరించారని తీవ్రంగా ఎండగట్టింది. అరెస్టు అనంతరం బాధితుడి స్థానం గురించి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
High Court: ఈ నెల 22న తాడేపల్లి సమీపంలో తన భార్యతో వెళ్తున్న సౌందర్ రెడ్డిని మఫ్టీలో ఉన్న పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ కేసులో అరెస్టు చేస్తున్నామని చెప్పినా, ఆ తరువాత పరిస్థితులు వేరుగా మారాయి. భార్య చేసిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో, ఆమె నేరుగా హైకోర్టును ఆశ్రయించింది.
ఇది కూడా చదవండి: IPS Transfers: హైదరాబాద్ సీపీగా సజ్జనార్.. తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు!
హైకోర్టు విచారణలో తాడేపల్లి పోలీసులు సౌందర్ రెడ్డి తమ అదుపులో లేడని నివేదించగా, అనూహ్యంగా 23న గుంటూరు జిల్లా పత్తిపాడు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించే ప్రయత్నం చేశారు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీసీ కెమెరా ఫుటేజ్, సెల్ టవర్ లొకేషన్లు సమర్పించాలని ఆదేశించింది.
తదుపరి విచారణలో బాధితుడి వెర్షన్, పోలీసుల వెర్షన్లో విరుద్ధతలు స్పష్టంగా బయటపడ్డాయి. అక్రమ అరెస్టు, యూనిఫాం లేకుండా వ్యవహరించడం, హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం, గంజాయి కేసులో ఇరికించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
వచ్చే నెల 13లోపు సీబీఐ పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పౌరులపై అక్రమ అరెస్టులు జరిగితే చూస్తూ ఊరుకోమని, నిజం ఏంటో వెలికి తీయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ కేసుతో ఏపీ పోలీసుల తీరుపై మళ్లీ చర్చ మొదలైంది. సీబీఐ విచారణ తర్వాత నిజం బయటపడితే, హైకోర్టు తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో సంచలనం రేపే అవకాశం ఉంది.
