Deadly Hornets: నరసాపురం తీర గ్రామాల్లో విషపుటీగల హడావిడి.. ప్రాణాలకు ముప్పు

Deadly Hornets: నరసాపురం తీర గ్రామాల్లో మళ్లీ విషపుటీగల ఉనికి కలకలం రేపుతోంది. చెట్లపై మట్టితో గూళ్లు కట్టి ఉండే ఈ పుటీగలు కదలిక గుర్తించిన వెంటనే మూకుమ్మడిగా దాడి చేస్తాయి. ఇటీవల వీటి దాడుల్లో పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా సంవత్సరాల తరువాత మళ్లీ వీటి జాడ కనిపించడం స్థానికుల్లో భయాందోళనలకు గురిచేస్తోంది.

Deadly Hornets: చిన్నపాటి కందిరీగల్లా కనిపించే ఈ పుటీగలు చెట్లపై మట్టితో గుండ్రటి గూళ్లు కట్టుకుంటాయి. వాటి గూడు ఉన్న ప్రాంతంలో కదలికలు జరిగితే.. ఒక్కసారిగా దాడికి దిగుతాయి. ఎంత జాగ్రత్తగా పారిపోయినా వీటి దాడి నుండి తప్పించుకోవడం కష్టమే. తాజాగా పేరుపాలెం సౌత్ పరిధిలోని ఉంగరాలవారి మెరక వద్ద ఓ కొబ్బరి చెట్టుకు పెద్ద గూడు కనిపించింది. అలాగే వేములదీవి పడమరలోని కాపులకొడప గ్రామం వద్ద దంపతులపై వీటి దాడి జరిగి తీవ్ర గాయాలు కలిగించాయి.

ఇది కూడా చదవండి: Pothole Tragedy: బెంగళూరులో విషాదం.. రోడ్డుపై గుంతల కారణంగా బలైన విద్యార్థిని..

ఇటీవల పీఎంలంక, పేరుపాలెం ప్రాంతాల్లో నలుగురు విషపుటీగల కాటుకు ప్రాణాలు కోల్పోయారు. నరసాపురం రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయ ఉద్యోగి సత్యనారాయణ కూడా వీటి దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. గతంలో సునామీ తర్వాత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని విషపుటీగలను నిర్మూలించారు. అప్పుడు రెవెన్యూ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్‌జీసీ కలిసి రాత్రివేళల్లో గూళ్లను దహనం చేశారు.

కానీ ప్రస్తుతం మళ్లీ ఇవి పెరుగుతున్నప్పటికీ, అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నరసాపురం ఆర్డీవో దాసి రాజు ఇప్పటికే కొన్ని గ్రామాల్లో నిర్మూలన చర్యలు చేపట్టామని, ఎక్కడైనా ఈగల ఉనికి గుర్తించిన వెంటనే రెవెన్యూ కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించారు.

నిపుణుల ప్రకారం, ఈ విషపుటీగలను వెస్పా అఫినిస్ లేదా లెస్సర్ బ్యాండెడ్ హార్నెట్ అంటారు. వీటి విషంలో హీమోలైసిన్లు, న్యూరోటాక్సిన్లు ఉండటంతో దాడి సమయంలో కాటు వేసిన ప్రదేశంలో తీవ్రమైన నొప్పి, వాపు కలుగుతాయి. కొన్నిసార్లు ఉబ్బసం, వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. తక్షణ చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *