Hyderabad Students: అమెరికాలో మరోసారి తెలుగు విద్యార్థులపై విషాదం ముసురుకుంది. కేవలం 48 గంటల వ్యవధిలోనే ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఓ విద్యార్థి మరణించగా, ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరొక విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు.
Hyderabad Students: శనివారం తెల్లవారు జామున హైదరాబాద్కు చెందిన 28 ఏళ్ల దళిత విద్యార్థి చంద్రశేఖర్ పోలే టెక్సాస్లోని డల్లాస్లో దారుణంగా కాల్చి చంపబడ్డాడు. గ్యాస్ స్టేషన్లో పార్ట్టైమ్ పనిచేస్తున్న సమయంలో దుండగులు దాడి చేశారు. చంద్రశేఖర్ డెంటల్ సర్జరీలో పట్టా సాధించి, 2023 ఆగస్టు నుంచి నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో డేటా అనలిటిక్స్లో మాస్టర్స్ చదువుతున్నాడు. తన చదువులు కొనసాగిస్తూ పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆదరణగా నిలుస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Viral News: ఫాస్ట్ ఫుడ్ పిచ్చి మరి ఇంతలా.. మ్యాగీ కోసం ఏకంగా ఒక కుర్రాడు!
ఈ ఘటనకు 24 గంటలు గడవకముందే మరో హైదరాబాద్ విద్యార్థి మృతి చెందాడు. చంచల్గూడకు చెందిన 25 ఏళ్ల షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్ చికాగో నగరంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవలే అమెరికాకు వెళ్లిన షెరాజ్, ఉన్నత విద్య కోసం అక్కడ స్థిరపడ్డాడు. అయితే, అక్టోబర్ 5వ తేదీన (ఆదివారం) జరిగిన ప్రమాదంలో ఘోరంగా మృతి చెందాడు.
తెలుగు విద్యార్థుల వరుస మరణాలు అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో భయాందోళనలను పెంచాయి. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఇద్దరు యువ విద్యార్థుల ప్రాణాలు ఇలా క్షణాల్లో ముగియడం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. అమెరికాలో ఉన్న విద్యార్థుల భద్రతపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
