Robo Martial Arts: మనిషిని తన్నే రోబోలు వస్తున్నాయ్.. ఈ రోబోట్ తో అంతా సామాను సర్దాల్సిందే!

Robo Martial Arts: రోబో సినిమా గుర్తుంది కదా. ఎవరూ అంత త్వరగా మర్చిపోరు లెండి. మనిషిలా ఆలోచించే రోబోకి సంబంధించిన కథ. అందులో రజనీకాంత్ కనిపెట్టిన రోబో చిట్టి చేసిన హడావుడి.. హంగామా మర్చిపోవడం అంత ఈజీ కాదు. అయితే, రోబో సినిమా తరువాత రోబోటిక్ టెక్నాలజీ మీద వస్తున్న అప్ డేట్స్ ఆ సినిమాని మించి కిక్ ఇస్తున్నాయి. సంచలనంగా మారుతున్నాయి. దాదాపు చిట్టి టైపు రోబోలు తయారు అవుతున్నాయి. సూపర్ ఫాస్ట్ గా ఈ టెక్నాలజీ ఇప్పుడు మెరుగులు దిద్దుకుంటోంది. అందులో ఏలోన్ మస్క్ తన “ఆప్టిమస్” రోబోతో పెను సంచలనాలు సృష్టించడానికి సిద్ధం అయిపోతున్నారు. 

Robo Martial Arts: టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్ “ఆప్టిమస్” తాజా వెర్షన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. రోబోటిక్స్ లో ఇదో కొత్త అధ్యాయం అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ ఒక పోస్ట్‌లో వీడియోను షేర్ చేశారు. ఇందులో, రోబోట్ చైనీస్ మార్షల్ ఆర్ట్ రూపం ‘కుంగ్ ఫూ’ నేర్చుకోవడం.. దాని ఆత్మరక్షణ పద్ధతులను ప్రదర్శించడం కనిపిస్తోంది. 

Robo Martial Arts: మస్క్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ  డెవలప్మెంట్  ఒక  రోబో తన యజమానికి అన్ని విధాలుగా సహాయం చేయడానికి వీలు కల్పించే ఆప్టిమస్ నైపుణ్యాలను నేర్పడానికి టెస్లా చేస్తున్న ప్రయత్నాలలో భాగం అని చెబుతున్నారు.  టెస్లా ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్ 2026 లో అందుబాటులోకి రావచ్చు. దాని ధర భారత కరెన్సీలో రూ. 16-24 లక్షలు ఉండవచ్చు.

ట్రైనర్ కు ప్రతిస్పందిస్తున్న రోబో.. 

కొత్త వీడియోలో, ఆప్టిమస్ రోబోట్ కుంగ్ ఫూ ట్రైనర్ ను  అనుకరించడమే కాకుండా, అతని ప్రతి కదలికకు ప్రతిస్పందిస్తుంది. అతని దాడులను ఎదుర్కొంటుంది. ఇది రోబోట్ నేర్చుకునే శక్తి , కొత్త విషయాలను నేర్చుకునే అనుకూలతను చూపుతుంది.  ఇది టెస్లా కొత్త టెక్నాలజీల లిస్ట్ కు మరింత కొత్తదనాన్ని చేర్చుతుంది. 

ఇంటిని శుభ్రపరచడం కూడా.. 

ఇప్పుడు, ఈ రోబోట్ మీ ఇంట్లో దాదాపు అన్ని రోజువారీ పనులను చేయగలదు. ఇది వంట చేయగలదు. ఇంటిని శుభ్రపరచగలదు. మస్క్ షేర్ చేసిన ఇంతకు ముందు  వీడియోలలో ఆప్టిమస్ రోజువారీ ఇంటి పనులను సులభంగా చేయడం, చెంచాతో గిన్నెలు కదిలించడం, నేలను వాక్యూమ్ చేయడం, బ్రష్, డస్ట్‌పాన్‌తో టేబుల్‌లను శుభ్రం చేయడం వంటివి చూపించారు.

అంతేకాదు ఈ ఆప్టిమస్ వస్తువు సున్నితత్వాన్ని కూడా గుర్తించగలదు. ఒక ఇటుకను బలంగా ఎలా హ్యాండిల్ చేస్తుందో.. అంతే సున్నితంగా ఒక కోడిగుడ్డును హ్యాండిల్ చేస్తుంది. అక్టోబర్ 2022లో జరిగిన టెస్లా AI డే ఈవెంట్ సందర్భంగా హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్‌ను తొలిసారిగా ప్రవేశపెట్టారు. గత సంవత్సరం, ఆప్టిమస్ జెన్ 2 అనే కొత్త జనరేషన్ తీసుకువచ్చారు.  అప్‌గ్రేడ్ చేసిన ఈ మోడల్ 30% వేగంగా పనిచేయగలదు.  మెరుగైన బ్యాలెన్స్ కలిగి ఉంటుంది. దీని బరువు 10 కిలోలు తక్కువ కూడా. 

Robo Martial Arts: ఆప్టిమస్ జెన్ 2 చేతులు తిరిగి డిజైన్ చేశారు. ఇది ఇంతకు ముందు  వెర్షన్ కంటే వేగంగా ఉంటుంది. సున్నితమైన మరియు దృఢమైన వస్తువులను ఎలా తీయాలో ఇది అర్థం చేసుకుంటుంది. అలాగే రంగుల ఆధారంగా వస్తువులను అంచనా వేయగలవు. దీని కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఈ ఆప్టిమస్ రోబోలకు ఇచ్చారు.  ఇది దానంతట అదే  రంగుల బ్లాక్‌లను ఎంచుకుని వేరు చేయగలదు. ఇంకా, ఇది తాను చూసిన లోపాలను కూడా స్వయంగా కరెక్షన్ చేస్తుంది.  తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులను భర్తీ చేయడానికి దీనిని డెవలప్ చేస్తున్నారు.

సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేయడం నుండి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ విభాగాల్లో పనిచేయడం వరకు మనిషిలా పనిచేయడానికి వీలుగా దీనిని మనిషిని పోలిన విధానంలోనే రూపొందించారు. 

అదండీ సంగతి. భవిష్యత్ ఏఐ ది అని చెప్పుకుంటున్న తరుణంలో ఈ మనిషిలా ఆలోచించి.. మనిషిలా పనిచేసే ఇంకా చెప్పాలంటే మనిషికంటే ఎక్కువ పనిని స్మార్ట్ గా వేగంగా చేయగలిగే రోబోలను టెస్లా అభివృద్ధి చేస్తుండడం.. అవి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుండడంతో భవిష్యత్ రోబో సినిమాలనే మారిపోయే రోజు అతి త్వరలోనే వచ్చేస్తుందనడంలో డౌట్ ఏమీ అక్కర్లేదు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *