Narendra Modi: దేశంలోనే మొట్టమొదటి 8 లేన్ల అర్బన్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభానికి సిద్ధం

Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 17న హర్యానాలో దాదాపు ₹11,000 కోట్ల వ్యయంతో నిర్మితమైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. వీటిలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, ఇది దేశంలోనే తొలి 8 లేన్ల అర్బన్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేగా గుర్తింపు పొందబోతోంది. ఈ ప్రాజెక్టుల ప్రారంభంతో ఢిల్లీ-ఎన్సిఆర్, గురుగ్రామ్ ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ జామ్‌ల నుండి ఉపశమనం లభించనుంది.

Narendra Modi: ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే 10.1 కిలోమీటర్ల పొడవుతో ఢిల్లీ విభాగంలో అభివృద్ధి చేయబడింది. దీని నిర్మాణానికి దాదాపు ₹5,360 కోట్లు ఖర్చు చేశారు. యశోభూమి, మెట్రో బ్లూ లైన్, ఆరెంజ్ లైన్, రాబోయే బిజ్వాసన్ రైల్వే స్టేషన్, ద్వారకా క్లస్టర్ బస్ డిపోలకు ఇది మల్టీ-మోడల్ కనెక్టివిటీని అందిస్తుంది. ఇకపై నోయిడా నుంచి ఢిల్లీ విమానాశ్రయం వరకు కేవలం 20 నిమిషాల్లోనే ప్రయాణం చేయడం సాధ్యం అవుతుంది. ఢిల్లీ రింగ్ రోడ్‌లోని ట్రాఫిక్ రద్దీ కూడా ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంతో తగ్గనుంది.

ఇక మరో కీలక ప్రాజెక్ట్ అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER-II). ఇది 76 కిలోమీటర్ల కారిడార్ రూపంలో అలీపూర్ నుండి డిచాన్ కలాన్ వరకు నిర్మించబడింది. దాదాపు ₹5,580 కోట్ల వ్యయంతో ఈ రహదారి ఏర్పాటైంది. ఇది బహదూర్‌గఢ్, సోనిపట్ వంటి ప్రధాన పట్టణాలతో పాటు ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-రోహతక్, ఢిల్లీ-సోనిపట్ వంటి రహదారులను అనుసంధానిస్తుంది. ముకర్బా చౌక్, ధౌలా కువాన్, ఢిల్లీ రింగ్ రోడ్లు వంటి అత్యంత రద్దీ ప్రదేశాల్లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించనుంది.

ఈ రెండు రహదారి ప్రాజెక్టులు ప్రారంభమవడం ద్వారా ప్రజలకు ప్రయాణ సమయం తగ్గడం, ఇంధన వ్యయం ఆదా కావడం, నగర శివారు ప్రాంతాల అభివృద్ధి వంటి అనేక లాభాలు కలగనున్నాయి. మల్టీ-మోడల్ కనెక్టివిటీతో ఢిల్లీ నగరానికి మరింత వేగవంతమైన రవాణా వ్యవస్థ లభించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *