Tamilnadu Election: తమిళనాడు రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా, ఒకేసారి రెండు ప్లాన్లను అమలు చేసింది కమలదండు. ఒకవైపు జాతీయ స్థాయిలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేస్తూనే, మరోవైపు తమిళనాడులో కొత్త రాజకీయ లెక్కలు వేసుకుంటోంది.
Tamilnadu Election: జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో, దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్నకు, బీజేపీ అగ్రనేతలతో కలిసి ప్రధాని మోదీ చర్చించి, చివరికి సీపీ రాధాకృష్ణన్ పేరును ఖరారు చేశారు. రాధాకృష్ణన్ గతంలో రెండు సార్లు ఎంపీగా, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా, అలాగే గవర్నర్‌గా పని చేశారు. రాజకీయ అనుభవం, ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ కలగలిపిన వ్యక్తిగా ఆయన ఎంపికను హైకమాండ్ మాస్టర్‌స్ట్రోక్‌గా భావిస్తోంది.
ఇదే సమయంలో, తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే కూటమి మరింత బలపడేలా వ్యూహం వేసినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొంగునాడు ప్రాంతం (కోయంబత్తూర్, కరూర్, సేలం, ఈరోడ్)లో గౌండర్ కమ్యూనిటీ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు. గౌండర్లు దేవరల తర్వాత అత్యంత ప్రభావవంతమైన సామాజిక వర్గం కావడంతో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పావు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఇక ఈ ప్రాంతంలో ఇప్పటికే అన్నాడీఎంకే బలమైన పట్టు కలిగి ఉండగా, బీజేపీ కూడా రాధాకృష్ణన్ పేరుతో మరింత బలపడే అవకాశం ఉంది. పళనిస్వామి, అన్నామలై వంటి నేతలు కూడా గౌండర్ కమ్యూనిటీకి చెందినవారే కావడంతో, ఈ సమీకరణ డీఎంకేపై గట్టి దెబ్బ కావొచ్చు.
రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్ గెలుపు దాదాపు ఖాయమే. అయితే, ఈ ఎంపిక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ వేసిన పెద్ద పాచికగా విశ్లేషకులు చెబుతున్నారు. కొంగుమండలంపై దృష్టి పెట్టిన బీజేపీ, అన్నాడీఎంకేతో కలిసి డీఎంకే ఆధిపత్యాన్ని బలహీనపర్చే ప్రయత్నం చేస్తోంది.
