PM Modi: ప్రధాని మోదీని కలిసిన శుభాంశు శుక్లా.. ఏం గిఫ్ట్ ఇచ్చారో?

PM Modi: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ ప్రత్యేక సందర్భంలో శుక్లా, దేశానికి గర్వకారణమైన బహుమతిని ప్రధానికి అందజేశారు.

PM Modi: శుక్లా తనతో పాటు అంతరిక్షంలో ప్రయాణించి వచ్చిన భారత త్రివర్ణ పతాకాన్ని ఫ్రేమ్ చేసి ప్రధానికి బహూకరించారు. అంతేకాకుండా, తన మిషన్‌కు సంబంధించిన ప్రత్యేక మిషన్ ప్యాచ్‌ను కూడా ప్రధానికి అందజేశారు. ఈ బహుమతులను స్వీకరించిన మోదీ, శుక్లాను సాదరంగా ఆలింగనం చేసుకుని అభినందించారు.

భేటీ సందర్భంగా శుభాంశు శుక్లా తన అంతరిక్ష యాత్రలో ఎదురైన అనుభవాలు, సవాళ్లు, ISS లో గడిపిన సందర్భాలు ప్రధానికి వివరించారు. అంతరిక్ష విజ్ఞానంలో తాజా పురోగమనాలు, భారత్ ప్రతిష్టాత్మక ‘గగన్‌యాన్’ మిషన్ భవిష్యత్తు గురించి కూడా ఇద్దరూ చర్చించారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే దశాబ్దాల్లో భారత అంతరిక్ష ప్రయాణాలకు 40-50 మంది వ్యోమగాములు అవసరమవుతారని తెలిపారు. అలాగే, భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణం, భారీ మిషన్లు చేపట్టబోతున్నదని, ఈ ప్రయాణంలో శుక్లా అనుభవం ఎంతో కీలకమని మోదీ అన్నారు.

శుభాంశు శుక్లా అందించిన త్రివర్ణ పతాకం, దేశానికి మాత్రమే కాకుండా అంతరిక్షంలో కూడా భారత ప్రతిష్టను ప్రతిబింబించే గొప్ప గుర్తుగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *