Crime News: మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో చోటుచేసుకున్న గర్భిణి స్వాతి హత్య కేసు మరింత సంచలనం రేపుతోంది. భార్యను హత్య చేసిన నిందితుడు మహేందర్, ఆమె తల, చేతులు, కాళ్లను ముక్కలుగా నరికి, ప్రతాప్సింగారం వద్ద మూసీ నదిలో పడేశానని పోలీసులకు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు మూసీ పరిసరాల్లో 10 కిలోమీటర్ల మేర విస్తృతంగా గాలించినప్పటికీ, మృతురాలి శరీర భాగాలు లభించలేదు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
Crime News: ప్రస్తుతం మృతురాలి మొండెం గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరచబడి ఉంది. ఇదిలా ఉండగా, నిందితుడు మహేందర్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. దర్యాప్తులో భాగంగా, అతడు భార్య హత్యను ముందే పక్కా ప్లాన్ వేసి చేసినట్లు బయటపడింది. హత్య అనంతరం, శవాన్ని ముక్కలుగా చేసి ఆధారాలు మాయం చేయడానికి ప్రయత్నించిన విధానం పోలీసులు క్రూరంగా వర్ణిస్తున్నారు.
స్వాతి మిస్సింగ్ విషయమై బంధువులకు కట్టుకథలు చెప్పి దారి మళ్లించేందుకు మహేందర్ మరో స్కెచ్ వేసినట్లు సమాచారం. అయితే, విచారణలో అసలు ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడలో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామస్థుల ఆగ్రహం కారణంగా నిందితుడు మహేందర్ కుటుంబసభ్యులు ఊరును విడిచివెళ్లారు.
మృతురాలి మొండెం భాగాన్ని ఇవాళే కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. అనంతరం దానిని స్వగ్రామమైన కామారెడ్డి గూడకు తరలించనున్నారు. ఈక్రమంలో పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
