Khammam: ఖమ్మం జిల్లాలో ఒక ప్రేమకథ చివరికి విషాదంగా మారింది!

Khammam: ఖమ్మం జిల్లాలో ఒక ప్రేమకథ చివరికి విషాదంగా మారింది. చిన్ననాటి పరిచయంతో మొదలైన బంధం అనేక కుదుపులు ఎదుర్కొన్నా, ముగియలేదు. చివరికి ఇద్దరూ విశాఖపట్నంలో కలిసి జీవనం ప్రారంభించినా, ఆ అనుబంధం దురదృష్టకర పరిణామానికి దారితీసింది. యువకుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ఆ యువతి తీవ్ర నిర్ణయం తీసుకుని ప్రాణాలు తీసుకుంది. అద్దె గదిలో ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

Khammam: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామానికి చెందిన కోళ్లపూడి రమ్య విశాఖలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహితుడు నరేష్ ప్రేమ పేరుతో విశాఖకు తీసుకెళ్లి, చివరికి దూరం పెట్టడంతో మోసపోయానన్న బాధతో ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఎర్రగడ్డ గ్రామానికి చెందిన నరేష్, రమ్య కొన్నేళ్ల క్రితం ప్రేమలో పడ్డారు. అప్పట్లో ఇద్దరూ ఇళ్లనుంచి వెళ్లిపోవడంతో కుటుంబ పెద్దలు వారిని సర్దిచెప్పి తీసుకొచ్చారు. అనంతరం నరేష్ తల్లిదండ్రులు అతనికి మరొక యువతితో వివాహం జరిపించారు. రమ్య చదువు మానేసి హైదరాబాద్‌లో మెడికల్ షాపులో పనిచేస్తుండగా, నరేష్ తన భార్యతో కలిసి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసేవాడు.

అయితే ఇటీవల రాఖీ పండుగకు రమ్య, నరేష్ ఇద్దరూ తమ ఇళ్లకు వెళ్లిన తర్వాత, విశాఖపట్నానికి వెళ్లారు. అక్కడ నరేష్ రమ్యకు తాళి కట్టి, అద్దె గదిలో నివసించారు. అయితే రాఖీ రోజు నుంచి నరేష్ కనిపించడం లేదంటూ అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న నరేష్, రమ్యను విశాఖలో వదిలేసి తన గ్రామానికి వచ్చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నరేష్ స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన రమ్య తన తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వారిద్దరి సంఘటనతో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *