PM Modi: అమెరికా విధించిన సుంకాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న వ్యాపారవేత్తలు, రైతులు, పశుసంవర్ధకులకు ఎటువంటి నష్టం జరగనివ్వబోమని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థిక ఒత్తిడిని తట్టుకునే శక్తిని తన ప్రభుత్వం పెంపొందిస్తోందని, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కు గుజరాత్ బలాన్ని అందిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.
PM Modi: అహ్మదాబాద్లో మాట్లాడుతూ మోదీ, “ప్రపంచ దేశాలు ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా రాజకీయాలు చేస్తున్నాయి. కానీ నా దేశంలోని చిన్న వ్యాపారులు, రైతులు, పశుపోషకుల ప్రయోజనాలు నాకు అత్యంత ప్రాధాన్యమైనవి. ఎంత ఒత్తిడి వచ్చినా వారిని కాపాడతాను” అని తెలిపారు.
సైన్యం ధైర్యసాహసాలను గుర్తుచేసుకుంటూ ప్రధాని ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సైన్యం చూపిన వీరత్వం దేశ గర్వకారణమని, స్వదేశీ ఉద్యమం బాపు చూపిన మార్గమే అని చెప్పారు. “స్వదేశీ” అనే పదాన్ని నోట్లో పెట్టుకోవడానికే వెనకాడే రాజకీయ పార్టీలను ఆయన తీవ్రంగా విమర్శించారు.
అలాగే, గుజరాత్లో ఒకప్పుడు కర్ఫ్యూ లాంటి పరిస్థితులు నిత్యమై ఉండేవని గుర్తుచేసిన ప్రధాని, నేడు అహ్మదాబాద్ దేశంలో అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విస్తరిస్తోందని గర్వంగా తెలిపారు.
ఇక అమెరికా సుంకాల సమస్యపై ప్రధాని కార్యాలయం ఆగస్టు 26న ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. వాషింగ్టన్ విధించిన కొత్త సుంకాలు భారతీయ ఎగుమతిదారులపై వ్యయభారం మోపనున్న నేపథ్యంలో, భవిష్యత్ వ్యూహాలపై చర్చించనున్నారు. అమెరికా మార్కెట్లోకి వెళ్ళే భారతీయ వస్తువులు 50% వరకు సుంకాన్ని ఎదుర్కొవలసి ఉంటుంది.
#WATCH | Ahmedabad, Gujarat: Prime Minister Narendra Modi says, “Today in the world, everyone is busy doing politics based on economic interests. From this land of Ahmedabad, I will tell my small entrepreneurs, my small shopkeeper brothers and sisters, my farmer brothers and… pic.twitter.com/aYGcdyiEPs
— ANI (@ANI) August 25, 2025
