Telangana: ఆమెకు 45.. అతడికి 24.. గుట్టుగా ఆ యవ్వారం!

Telangana: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్న డబుల్ మర్డర్ మిస్టరీ రహస్యాన్ని పోలీసులు చేధించారు. యూట్యూబ్ వీడియోల నుంచి మర్డర్ స్కెచ్ వేసి క్షుద్రపూజల కలకలం సృష్టించిన ఈ ఘటన వెనుక ఒక కసాయితల్లి క్రూరకథ వెలుగులోకి వచ్చింది. తనకంటే 20 ఏళ్లు చిన్న వయసు గల యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ మహిళ, మొదట భర్తను హత్య చేసి, తర్వాత అనుమానం వ్యక్తం చేసిన స్వంత కూతురినే బలి తీసుకుంది.

Telangana: గత నెల 25వ తేదీన కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. అక్కడ నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో క్షుద్రపూజల ఆనవాళ్లు కనబడటంతో ప్రజలు షాక్ అయ్యారు. మొదట క్షుద్రపూజల బలి అనుకున్న ఈ కేసు వెనుక భయంకర నిజం బయటపడింది. పోలీసులు విచారణలో మృతురాలు చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన వర్షిణి అని గుర్తించారు.

పోలీసుల దర్యాప్తులో వర్షిణి తల్లి కవితే హంతకురాలని తేలింది. 24 ఏళ్ల రాజ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత, ముందుగా తన భర్త కుమారస్వామిని హత్య చేసి, అతను అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించింది. ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేసిన పెద్దకూతురు వర్షిణిని కూడా తన ప్రియుడితో కలిసి దారుణంగా చంపేసింది.

కూతురి మృతదేహాన్ని సంచిలో పెట్టి గ్రామ శివారులో వదిలిన కవిత, తర్వాత యూట్యూబ్‌లో చూసిన క్షుద్రపూజల సీన్‌ను అడవిలో రిప్లికేట్ చేసింది. అందరినీ తప్పుదారి పట్టించేందుకు ఇదంతా ప్లాన్ చేసింది. కానీ పోలీసుల కచ్చితమైన దర్యాప్తు, టెక్నాలజీ ఆధారంగా చేసిన నిఘాతో ఈ హత్య రహస్యం బయటపడింది.

ప్రస్తుతం నిందితురాలు కవిత, ఆమె ప్రియుడు రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కారే, ఈ కేసును విజయవంతంగా చేధించిన పోలీసు బృందాన్ని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *