Narendra Modi: దేశాభివృద్ధిలో మిజోరం భాగస్వామ్యం కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మిజోరం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌ను భారత రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే చరిత్రాత్మక బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. రూ. 8,070 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ 51.38 కిలోమీటర్ల రైల్వే మార్గం ఈశాన్య భారతదేశంలో కనెక్టివిటీని పెంచడంలో ఒక మైలురాయిగా నిలిచింది.
Narendra Modi: ఈ సందర్భంగా మిజోరంలో రూ.9,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను కూడా ప్రధాని ప్రారంభించారు. రైలు మార్గం కొండ ప్రాంతాల్లో నిర్మాణం కష్టతరమైనప్పటికీ, ఇంజినీర్ల ప్రతిభ, కార్మికుల కృషితో అసాధ్యాన్ని సాధ్యం చేశారని మోదీ కొనియాడారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడటం ద్వారా పర్యాటక రంగం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: తొలి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని..ప్రత్యేకతలు ఇవే!
ఈ రైల్వే ప్రాజెక్టులో 48 సొరంగాలు, 55 పెద్ద వంతెనలు, 87 చిన్న వంతెనలు, 5 రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు, 6 రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా, 114 మీటర్ల ఎత్తైన బ్రిడ్జ్ నెం.196 కుతుబ్ మీనార్ కంటే 42 మీటర్లు ఎక్కువ ఎత్తు కలిగి ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ మార్గం ఐజ్వాల్‌ను గౌహతి, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాలతో అనుసంధానిస్తుంది.
ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో మూడు కొత్త రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించారు సైరాంగ్-ఆనంద్ విహార్ రాజధానీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ), కోల్‌కతా-సైరాంగ్-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ (త్రై-వీక్లీ), గౌహతి-సైరాంగ్-గౌహతి ఎక్స్‌ప్రెస్ (డైలీ). ఇవి వాణిజ్యం, పర్యాటకం, రవాణా రంగాలను బలోపేతం చేస్తాయని చెప్పారు.
అదనంగా, ప్రధాని రూ.9,000 కోట్ల విలువైన ఇతర ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఇందులో రెసిడెన్షియల్ స్కూల్లు, ఎల్పిజి బాట్లింగ్ ప్లాంట్, రహదారులు, క్రీడా సౌకర్యాలు ఉన్నాయి. మిజోరంలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మోదీ పిలుపునిచ్చారు.
