Vahanamitra Scheme: ఆంధ్రప్రదేశ్లో ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వాహనమిత్ర పథకంకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు దసరా కానుకగా డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.
Vahanamitra Scheme: ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఈ నిధులు డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, వాహన రిపేర్లు వంటి ముఖ్యమైన ఖర్చులకు ఉపయోగపడతాయి. దీంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కొంత ఆర్థిక భారం తగ్గనుంది.
ఇది కూడా చదవండి: Nara Lokesh-PM Modi: జీఎస్టీ సంస్కరణలతో ఉపశమనం.. ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ!
ఎవరు అర్హులు?
- చెల్లుబాటు అయ్యే ఆటో లేదా లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- వాహనం ఏపీలోనే రిజిస్టర్ అయి ఉండాలి.
- ఆటోలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా ఈ సారి అనుమతిస్తారు, కానీ ఒక నెలలోపు తప్పనిసరిగా పొందాలి.
- దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు లేదా రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు.
- ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అనర్హులు. అయితే పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంది.
- ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి.
- వ్యవసాయ భూమి 10 ఎకరాల లోపు ఉండాలి.
- పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నివాస/వాణిజ్య భవనం ఉండకూడదు.
- వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.
ఈనెల 17 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో వాహనమిత్ర దరఖాస్తులు స్వీకరించబడతాయి. కొత్త లబ్ధిదారులు 19 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత 24న తుది జాబితా విడుదల కానుంది. అర్హులైన డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో అక్టోబర్ 1న నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకం ద్వారా వేలాది మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు లబ్ధి పొందే అవకాశం ఉంది.
