Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన: మహిళ వేషంలో చోరీ చేసిన యువకుడు..!

Hyderabad: హైదరాబాద్‌లో ఓ యువకుడు మహిళ వేషంలో దొంగతనానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. లోన్ యాప్స్‌లో అప్పులు చేసి వాటిని తీర్చలేకపోయిన వ్యక్తి చివరికి స్నేహితుడి ఇంటినే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బంజారాహిల్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది.

Hyderabad: బంజారాహిల్స్‌ ఉదయ్ నగర్‌లో నివసించే శివరాజ్ ఈ నెల 16న కుటుంబంతో కలిసి నిజామాబాద్‌ వెళ్లాడు. ఈ విషయాన్ని అతని కుమారుడు తన స్నేహితుడు హర్షిత్‌కు ఫోన్‌లో చెప్పాడు. మరుసటి రోజు శివరాజ్ కుటుంబం తిరిగి హైదరాబాద్‌ వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి, అల్మారాలోని 6.75 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.10 లక్షల నగదు మాయమైందని గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: PM Modi: అరుణాచల్‌ పర్యటనలో ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం!

పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఒక మహిళ ఇంట్లోకి వెళ్లి బయటకు వస్తున్నట్లు కనిపించింది. అయితే చోరీకి ఒకరోజు ముందు ప్రాంతంలో తిరుగుతున్న వ్యక్తిని కూడా కెమెరా రికార్డ్ చేసింది. ఆ వ్యక్తి హర్షిత్ అని శివరాజ్ కుమారుడు గుర్తించాడు. దీంతో పోలీసులకు అసలు విషయం అర్థమైంది.

తర్వాత లింగంపల్లిలోని హర్షిత్ ఇంటిపై దాడి చేసిన పోలీసులు.. 6.75 తులాల బంగారు నగలు, రూ.85 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో హర్షిత్ నేరాన్ని ఒప్పుకున్నాడు. మహిళ వేషంలో వెళ్లి చోరీ చేసినట్లు తెలిపాడు. దొంగిలించిన డబ్బులో రూ.25 వేలు అప్పు తీర్చడానికి వినియోగించినట్లు కూడా అంగీకరించాడు.

లోన్ యాప్‌ల ఒత్తిడితోనే ఈ దారుణానికి పాల్పడినట్లు హర్షిత్ పోలీసులకు చెప్పాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *