Lionel Messi: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్… 14 ఏళ్ల తర్వాత భారత్‌కు రాబోతున్న మెస్సీ!

Lionel Messi: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 14 ఏళ్ల తర్వాత భారత్‌ పర్యటనకు రానున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. డిసెంబర్ 14, 2025న మెస్సీ తన GOAT టూర్ లో భాగంగా ముంబైకి రానున్నారు. 2011లో కోల్‌కతాలో జరిగిన అర్జెంటీనా–వెనిజులా ఫ్రెండ్లీ మ్యాచ్ తర్వాత ఆయన భారత్‌ పర్యటన ఇదే మొదటిసారి కావడం విశేషం.

Lionel Messi: మెస్సీ పర్యటన ఖరారైన సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు తన సంతకం చేసిన ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపారు. ఈ విషయాన్ని ఫడ్నవీస్ స్వయంగా తన ఎక్స్‌ హ్యాండిల్‌లో పంచుకున్నారు. “లియోనెల్ మెస్సీ మహారాష్ట్రకు వస్తున్నారు, నా యువ మిత్రులతో ఫుట్‌బాల్ ఆడబోతున్నారు! నాకు ఆయన సంతకం చేసిన ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపినందుకు ధన్యవాదాలు. డిసెంబర్ 14న గోట్ టూర్‌లో భాగంగా ముంబై పర్యటనకు స్వాగతం” అంటూ ట్వీట్ చేశారు.

మెస్సీ పర్యటన మహారాష్ట్ర యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఒక గొప్ప అవకాశం. రాష్ట్ర క్రీడా విభాగం, మిత్ర (MITRA), వెస్టర్న్ ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (WIFA) కలిసి 14 ఏళ్ల లోపు యువ ఆటగాళ్లను ఎంపిక చేసి, వారిని మెస్సీతో ప్రత్యేక శిక్షణ పొందే అవకాశం కల్పించనున్నాయి. ఈ కార్యక్రమం ఫుట్‌బాల్ పట్ల యువతలో మరింత ఆసక్తిని పెంచుతుందని సీఎం ఫడ్నవీస్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో కేరళ క్రీడా మంత్రి వి. అబ్దురహీమాన్ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. నవంబర్ 2025లో ఫిఫా అంతర్జాతీయ విండో సందర్భంగా మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జాతీయ జట్టు కేరళలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుందని చెప్పారు. ఈ విషయాన్ని అధికారిక ఈమెయిల్ ద్వారా ధృవీకరించారని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

భారత అభిమానులకు మెస్సీ పర్యటన ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *