Khammam: ఖమ్మం నగరంలో ఒక మహిళను అచ్చం సినిమా స్టైల్లో మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై బంగారు బిస్కెట్ దొరికిందని చెప్పి నిందితులు నాటకమాడి, డబ్బు, బంగారం దోచుకెళ్లారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం వేట ప్రారంభించారు.
Khammam: కొణిజర్ల మండలానికి చెందిన 55 ఏళ్ల మహిళ ఖమ్మం నగరం బోసుబొమ్మ సెంటర్లో నివాసం ఉంటోంది. సెప్టెంబర్ 20న ఆమె పాత బస్టాండు వైపు నుంచి ఇంటికి నడిచి వెళ్తుండగా, గాంధీచౌక్ వద్ద ఓ అపరిచిత మహిళ వెంటపడింది. ఆంధ్రాబ్యాంక్ సమీపంలో ఆ అపరిచితురాలు ఓ పొట్లాను చూపించి, అందులో బంగారం బిస్కెట్ దొరికిందని చెప్పింది. దాన్ని అమ్మితే సగం భాగం తనకు ఇస్తానని ఆమెను నమ్మించింది.
ఇది కూడా చదవండి: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు!
ఈ సమయంలో అక్కడికి వచ్చిన మరో వ్యక్తి ఆ బంగారు బిస్కెట్ పది తులాలు ఉంటుందని, దాని విలువ రూ.10 లక్షలకుపైగా ఉంటుందని చెప్పి మరింత నమ్మబలికాడు. దీంతో ఆ మహిళ పూర్తిగా నమ్మి, తన దగ్గరున్న ₹10,000 నగదు, మెడలోని సుమారు 2 తులాల బంగారపు గొలుసును ఇచ్చేసింది. నిందితురాలు మిగిలిన డబ్బు తీసుకురావాలని చెప్పి, తాను కేశవరావు పార్క్ వద్ద వేచి ఉంటానని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయింది.
తరువాత ఆ పొట్లాను తనిఖీ చేయగా అది నకిలీ బంగారం అని తెలిసింది. అప్పటికే నిందితులు జాడ తప్పించారు. మోసపోయినట్లు గ్రహించిన ఆ మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పక్కా ప్రణాళికతో ఈ మోసాన్ని జరిపారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, నిందితుల ఫొటోలు విడుదల చేశారు. ఎవరికైనా వారి గురించి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.
