Mohsin Naqvi: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఎట్టకేలకు బీసీసీఐ ముందు తలవంచినట్లు సమాచారం. ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఆయన భారతదేశానికి క్షమాపణలు చెప్పారని వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఈ వివాదం పరిష్కారం వైపు ఒక అడుగు పడిందని భావిస్తున్నారు.
Mohsin Naqvi: సెప్టెంబర్ 30న జరిగిన ACC సమావేశంలో ఆసియా కప్ ట్రోఫీ వివాదం ప్రధాన చర్చగా నిలిచింది. ఈ సమావేశానికి BCCI ప్రతినిధులుగా రాజీవ్ శుక్లా, ఆశిష్ షెలార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా షెలార్ నఖ్వీని నేరుగా ప్రశ్నిస్తూ, “వెస్టిండీస్‌పై విజయం సాధించినందుకు నేపాల్‌ను అభినందించారు.. కానీ ఆసియా కప్ గెలిచిన భారత్‌ను ఎందుకు అభినందించలేదు?” అని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Viral Reel: ఏంటి సుధా లైక్స్ కోసం ఏమైనా చస్తారా.. మరి ఇలా చేయాలా..!
ఈ ప్రశ్నలతో ఒత్తిడికి గురైన మొహ్సిన్ నఖ్వీ భారతదేశానికి క్షమాపణలు చెబుతూ, తన తప్పును ఒప్పుకున్నారు. భారత జట్టుకు అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా అంగీకరించారు. అయితే ట్రోఫీ విషయంలో మాత్రం మొండి వైఖరిని విడిచిపెట్టలేదు. మీడియా నివేదికల ప్రకారం, ట్రోఫీని తిరిగి ఇవ్వడానికి సిద్ధమని, కానీ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ACC కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని షరతు పెట్టారు.
నఖ్వీ వైఖరి చూసి ఈ వివాదం ఇంకా కొనసాగుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. నవంబర్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో ఆసియా కప్ ట్రోఫీ అంశాన్ని మళ్లీ ప్రస్తావించవచ్చని సమాచారం. దీంతో బీసీసీఐ ఈ అంశాన్ని ఐసీసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మొత్తానికి, నఖ్వీ క్షమాపణలు చెప్పినా.. ట్రోఫీ వివాదం ఇంకా పూర్తిగా ముగిసిపోలేదని స్పష్టమవుతోంది.
