Tirumala Brahmotsavam: ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు – రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం!

Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి జరిగిన ధ్వజావరోహణంతో విజయవంతంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరిగిన ఈ ఉత్సవాలను చూడటానికి దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తిరుమలను తరలి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మొత్తం రూ.25.12 కోట్ల హుండీ ఆదాయం లభించింది.

Tirumala Brahmotsavam: గురువారం రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం అనంతరం ధ్వజావరోహణ కార్యక్రమం జరిగింది. ఇందులో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, సివిఎస్ఓ మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Vijayawada Kanaka Durga: అమ్మవారి కోసం తరలివస్తున్న భక్తజనకోటి అధికారుల విస్తృత ఏర్పాట్లు!

టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వివరాలు వెల్లడిస్తూ, తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాల్లో 5.80 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా 26 లక్షల మంది పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించగా, 2.42 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. లడ్డూల విక్రయం 28 లక్షలకు పైగా నమోదైంది.

భక్తుల రాకపోకల కోసం ఏపీఎస్ ఆర్టీసీ 4.40 లక్షల మందిని తిరుపతి నుంచి తిరుమలకు, 5.22 లక్షల మందిని తిరుమల నుంచి తిరుపతికి రవాణా చేసింది.

ఇక, స్వామివారికి గురువారం మరో ప్రత్యేక విరాళం అందింది. ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం వెంకటేశ్వర్లు టెక్స్‌టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ అంకిత్, టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని (స్విమ్స్) పథకానికి రూ.30 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చెక్కును బీ.ఆర్.నాయుడుకు అందజేశారు.

తిరుమల బ్రహ్మోత్సవాలను ఘనంగా ముగించిన ఈ సందర్భం, భక్తుల విశ్వాసం, భక్తి ప్రపత్తిని ప్రతిబింబించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *