UGC: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పలు కోర్సులను ఇకపై ఓపెన్, ఆన్లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) విధానంలో బోధించకూడదని ఆదేశించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది.
UGC ప్రకటన ప్రకారం, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషన్స్ యాక్ట్, 2021 పరిధిలోకి వచ్చే కోర్సులను ఆన్లైన్ లేదా దూరవిద్యా విధానంలో ఇకపై బోధించరాదు. అంటే ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రత్యేక కోర్సుల్లో ఇకపై ఆన్లైన్ అడ్మిషన్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
ఇది కూడా చదవండి: War2 Movie Collections: బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న వార్2..రెండో రోజు ఎంత వచ్చాయంటే!
ఈ నిషేధం జూలై-ఆగస్టు 2025 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది. గతంలో ఏప్రిల్ 22న జరిగిన 24వ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వర్కింగ్ గ్రూప్ సమావేశంలో వచ్చిన సిఫార్సుల ఆధారంగా, జూలై 23న జరిగిన UGC 592వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఇకపై సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, డైటెటిక్స్ వంటి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అన్ని స్పెషలైజేషన్లను ఆన్లైన్/ODL విధానంలో అందించరాదని పేర్కొంది.
అయితే ఇతర సబ్జెక్టులు – ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, గణితం, ప్రజా పరిపాలన, తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం, గణాంకాలు, మానవ హక్కులు, సంస్కృతం, భూగోళ శాస్త్రం, సామాజిక శాస్త్రం, మహిళా అధ్యయనాలు వంటి కోర్సులు యథావిధిగా కొనసాగుతాయి. కేవలం హెల్త్కేర్ సంబంధిత కోర్సులపైనే ఈ నిషేధం వర్తించనుంది.
UGC ఈ నిర్ణయంతో విద్యార్థులకు స్పష్టమైన గైడ్లైన్ ఇచ్చింది. రాబోయే విద్యా సంవత్సరం నుండి ఈ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాలు అడ్మిషన్లు కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
