NEET 2025: మెడికల్ కాలేజీలలో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ 2025 ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థులు రూల్స్ పాటిస్తూ పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 95 శాతానికి పైగా తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష రాశారు. అయితే, ఈ పరీక్షల సమయంలో అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి కాకినాడలో జరిగింది. నీట్ ఎగ్జామ్ రాయడానికి 72 ఏళ్ల ముసలవ్వ వచ్చింది. ఆమె పరీక్ష రాయడానికి రావడంతో ఎగ్జామ్ సెంటర్ వద్ద అందరూ ఆశ్చర్యపోయారు. కాకినాడకు చెందిన ఒక వృద్ధురాలు ఈ వయసులో నీట్ పరీక్ష రాయడంతో అంతా షాక్ అయ్యారు. కాకినాడకు చెందిన పోతుల వెంకటలక్ష్మికి 72 ఏళ్లు. ఆమె ఈ వయసులో నీట్ ఎగ్జామ్ రాశారు.
NEET 2025: దీని కోసం ఆమె కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఆదివారం వెళ్లారు. అక్కడ పరీక్ష సమయం దగ్గపడటంతో తనిఖీ కేంద్రం వద్ద ఆధార్, హాల్టికెట్ను చూపించి పరీక్ష రాసేందుకు వెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదువుకు వయసు అడ్డం కాదని అందరూ అంటున్నారు. అంతేకాదు.. ఎగ్జామ్ సెంటర్ వద్ద విద్యార్థులు ఆమెను చూసి ఎంతో స్ఫూర్తి పొందినట్టు చెప్పారు.
NEET 2025: ఇదిలా ఉంటె తెలంగాణలో మరో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మంచానాయక్ తండాకు చెందిన తల్లీకూతురు బానోత్ సరిత, బానోత్ కావేరి ఒకేసారి నీట్ ఎగ్జామ్ రాశారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన పెద్ద కూతురితో కలిసి తల్లి కూడా నీట్ పరీక్ష రాసింది. ఇద్దరూ కలిసి ఖమ్మంలో ఒకే గదిలో ఉండి కోచింగ్ తీసుకున్నారు. అనంతరం తల్లి సరిత సూర్యాపేటలో పరీక్ష రాసింది. కూతురు కావేరి ఖమ్మంలో పరీక్ష రాసింది. తన తల్లితో కలిసి ఒకే చోట కోచింగ్ తీసుకోవడం.. ఒకేసారి పరీక్ష రాయడం ఏంతో సంతోషంగా యునాని కావేరి ఈ సందర్భంగా చెప్పింది.
చదువుకు వయసు అడ్డంకి కాదు. నిత్య విద్యార్థులుగా చాలామంది ఉంటారు. కానీ, పరీక్షలకు హాజరు అవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. పెళ్లి అయిపోతే ఇంకా చదువుకు సెలవు చెప్పేస్తారు చాలామంది అలంటి వారికి పై రెండు సంఘటనలు స్ఫూర్తిగా నిలుస్తాయి.
