Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై జరిగిన దాడి కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. ఇప్పటికే ప్రధాన నిందితుడు ఆటో డ్రైవర్ ఖిమ్జీ (41)ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, అతని స్నేహితుడు తహ్సీన్ సయ్యద్‌ను కూడా శుక్రవారం రాత్రి గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చి అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Rekha Gupta: పోలీసుల విచారణలో తహ్సీన్, దాడి రోజున ఖిమ్జీకి రూ.2,000 పంపినట్లు అంగీకరించాడు. అంతేకాదు, ముఖ్యమంత్రి షాలిమార్ బాగ్ నివాసానికి సంబంధించిన వీడియోను ఖిమ్జీ తనకు పంపాడని తెలిపాడు. ప్రజా విచారణ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే దాడి జరగడానికి ఇది ఒక ప్లాన్‌గానే ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రధాన నిందితుడు ఖిమ్జీపై ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2017 నుంచి 2024 వరకు రాజ్‌కోట్‌లోని భక్తినగర్ పోలీస్ స్టేషన్లో దాడి, అక్రమ మద్యం రవాణా, మద్యం తాగి ఆటో నడపడం వంటి ఐదు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 2017లో ఒకరిపై కత్తితో దాడి చేసిన ఘటనతో పాటు, 2022లో కుటుంబ గొడవలో తన తలపై తానే బ్లేడుతో కోసుకున్న కేసు కూడా ఉంది.
సుప్రీంకోర్టు వీధికుక్కల సమస్యపై ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో నిరసన నిర్వహించాలని ఖిమ్జీ ప్రణాళిక చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. అదే సమయంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రజా విచారణ జరుగుతుండటంతో అక్కడికి వెళ్లాడని పోలీసులకు తెలిపాడు.
ప్రస్తుతం ఖిమ్జీని ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. తహ్సీన్ సయ్యద్‌ను కూడా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. దాడి వెనుక మరెవరైనా ఉన్నారా, ఆర్థిక సహాయం ఎవరిచ్చారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
