Kanpur: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రోడ్డు రద్దీ కారణంగా రెండు కుటుంబాలు దారుణమైన విషాదాన్ని ఎదుర్కొన్నాయి. 2 కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న రెండు వాహనాల్లో ఉన్న రోగులు ఆసుపత్రికి చేరుకునేలోపే మరణించారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kanpur: వివరాల్లోకి వెళితే, శుక్లాగంజ్ నివాసి మున్నా (55)కి సోమవారం మధ్యాహ్నం ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆటోలో కార్డియాలజీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలో LLR మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ జామ్లో ఆటో చిక్కుకుంది. 1 కిలోమీటర్ దూరం వెళ్లడానికి సుమారు 30 నిమిషాలు పట్టింది. ఆటోలో విలవిలాడుతున్న మున్నాకు కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పినా, ఆలస్యమైనందువల్ల ఆసుపత్రికి చేరుకునేలోపే అతను కన్నుమూశాడు.
ఇది కూడా చదవండి: Couple Missing: అయ్యో దేవుడా..! చేపల వేటకు వెళ్లిన దంపతులు!
ఇక మరో ఘటనలో, సచేండి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఒక వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని కానిస్టేబుల్ ముఖేష్ యాదవ్, అజిత్ కుమార్లు PRV వాహనంలో హాలెట్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అయితే అదే ట్రాఫిక్ జామ్లో ఈ వాహనం కూడా చిక్కుకుంది. దాంతో గాయపడిన వృద్ధుడికి సకాలంలో చికిత్స అందకపోవడంతో వాహనంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఒకే సమయంలో రెండు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోవడం స్థానిక ప్రజలను కదిలించింది. ట్రాఫిక్ నిర్వహణలో నిర్లక్ష్యం వలన అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని వారు మండిపడుతున్నారు. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
